Dasoju Sravan: మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతల పార్టీల మార్పులు కొనసాగుతున్నాయి. భువనగిరి మాజీ ఎంసీ బూర సర్సయ్యగౌడ్‌ను బీజేపీలో చేర్చుకుని టీఆర్‌ఎస్‌కు పెద్దషాక్ ఇచ్చిన బీజేపీకి టీఆర్‌ఎస్ షాక్‌ల మీద షాక్ ఇస్తోంది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భిక్ష్యమయ్య గౌడ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని 24 గంటలు గడవక ముందే బీజేపీ మరో కీలక నేతలకు టీఆర్‌ఎస్ గాలం వేసింది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్‌ను తిరిగి సొంతగూటికి రప్పించడలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సక్సెస్ అయ్యారు. దీంతో దాసుజో బీజేపీకి రాజీనామా చేశారు.

తెలంగాణ ఉద్యమంతో గుర్తింపు..
తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా టీఆర్‌ఎస్‌లో చేరారు శ్రవణ్. ఉద్యమంలో బాల్కసుమన్, రఘునందర్‌నావుతో కలిసి కీలకపాత్ర పోషించారు. యువ నేతలతో కలిసి చేసిన వివిధ కార్యక్రమా ద్వారా టీఆర్‌ఎస్‌లో చురుకైన నేతగా గుర్తింపు పొందారు. నాటి ఆంధ్రా పాలకులను సబ్జెక్టు పరంగా విమర్శించడంలో, తెలంగాణ ఆవశ్యకతను మీడియా ముందు ప్రజెంట్ చేయడంలోనూ కీలకంగా మారారు. టీవీ డిబేట్లలోనూ శ్రవణ్ వాగ్దాటితో ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
స్వరాష్ట్రం సిద్ధించాక టీఆర్‌ఎస్‌కు రాజీనామా..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత శ్రవణ్ టీఆర్‌ఎస్‌ను వీడారు. 2014లో తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో శ్రవణ్ ఖైరతాబాద్ టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి కూడా ఖైరతాబాద్ టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం నిరాకరించడంలో నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి సారథ్యాన్ని వ్యతిరేకించి రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడారు.
ఇటీవలే బీజేపీలో చేరిక..
తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు సమక్షంలో ఆగస్టు 5న బీజేపీలో చేరారు. ఆయన మద్దతుదారులు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్‌చుగ్, కిషన్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మురళీధర్‌రావు, లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశానని, ఆర్‌ఎస్‌ఎస్‌తో కూడా తనకు అనుబంధం ఉందన్నారు. ఇప్పుడు సొంతింటికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.
రెండు నెలలకే రాజనామా..
తాజాగా శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరి రెండు నెలలు అయినా ఆయన ఎక్కడా పార్టీ తరఫున మాట్లాడలేదు. టీవీ డిబేట్లలోనూ పాల్గొనలేదు. పార్టీలో చేరిన రోజు సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని చెప్పిన శ్రవణ్ పార్టీలో మాత్రం ఇమడలేదు. దీంతో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఈ క్రమంలో బూర నర్సయ్యగౌడ్‌ను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ ఇచ్చిన బీజేపీపై కేటీఆర్ ప్రతీకార చర్యకు దిగారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ను తిరిగి సొంతగూటికి రప్పించారు. తాజాగా తెలంగాణ ఉద్యోమంలో కీలకంగా వ్యవహరించిన, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన దాసోజు శ్రవణ్‌ను కూడా సొంత గూటికి తీసుకురావడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు.

భువనగిరి ఎంపీ టికెట్..?
తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న బూర నర్సయ్యగౌడ్ ఇటీవల మునుగోడు టీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఉద్యమకారుడి స్థానాన్ని ఉద్యమకారుడితోనే భర్తీ చేయాలని భావించిన కేటీఆర్ బీజేపీలో ఇటీవల చేరిన టీఆర్‌ఎస్ మాజీ నేత దాసోజు శ్రవణ్‌ను గులాబీ గూటిలోకి రప్పించాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తానన్న హామీతో శ్రవణ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నట్లు తెలిసింది. మొత్తంగా మునుగోడు ఎన్నికలు సమీపిస్తున్నా.. పార్టీ ఫిరాయింపులు ఇంకా ఆగడం లేదు. అయితే శ్రవణ్ పార్టీ మార్పుపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎన్ని పార్టీలు తిరుగుతావు స్వామీ అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.