YCP: ఏపీలో అధికార వైసీపీకి ఎక్కడ ఏ పరిస్థితి ఉన్నా.. ఎక్కడ బలం తగ్గినా.. పార్టీ అధినేత జగన్ సొంత జిల్లా కడప మాత్రం కంచుకోట. ఇక్కడ వైసిపికి ఎదురులేని పరిస్థితి. 2014లో ఒకచోట మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. 2019లో రెండు ఎంపీ స్థానాలతో పాటు 10 ఎమ్మెల్యే స్థానాలను వైసిపి స్వీప్ చేసింది. తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఐదేళ్లలో సీన్ కట్ చేస్తే ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నుంచి టిడిపిలోకి చేరికలు పెరగడంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. మొన్నటివరకు ఒక్క సీటుకే పరిమితమైన విపక్షం.. నాలుగు నుంచి ఐదు స్థానాల్లో బలోపేతం కావడం విశేషం. ఎన్నికల నాటికి జిల్లా వ్యాప్తంగా విపక్షాలు బలోపేతం అయ్యే అవకాశం ఉండడంతో.. అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది.
రాయచోటి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య టిడిపిలో చేరడంతో కడప జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డికి స్వయానా బావమరిది కావడం విశేషం. ఈ విషయంలో ద్వారకానాథ్ రెడ్డి మేనకోడలు అలేఖ్య కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె దివంగత సినీ నటుడు నందమూరి తారకరత్న సతీమణి. ఈమెకు చంద్రబాబు కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ద్వారకానాథ్ రెడ్డి టిడిపి కండువా కప్పుకున్నప్పుడు ఆమె పక్కనే ఉండడం విశేషం. విజయసాయిరెడ్డి దంపతులు మినహా.. మిగతా కుటుంబ సభ్యులంతా టిడిపిలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారి చేరికతో రాయచోటి నియోజకవర్గం లో టిడిపి పటిష్ట స్థితిలో చేరడం విశేషం. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సైతం అనూహ్యంగా టిడిపిలో చేరారు. నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి సంప్రదింపులు జరిపారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చి టిడిపిలో చేరారు. వీరి చేరిక ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రమాదకర హెచ్చరికలు వచ్చాయి. తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైసీపీకి ఎదురుగాలి వీచింది. అప్పటి నుంచే కడప వైసీపీ పునాదులు కదిలేయన్న చర్చ ప్రారంభమైంది. అధికార పార్టీ తన మార్కు ప్రతాపం చూపించిన పట్టభద్రులు మాత్రం తెలుగుదేశం పార్టీపై స్పష్టమైన నమ్మకాన్ని కనబరిచారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ లో ఓటురు తీరుతో జనం నాడీ అర్థమైంది. డేంజర్ బెల్స్ మోగినట్లేనని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి వైసీపీ నుంచి టిడిపిలోకి భారీ చేరికలు చూస్తుంటే.. కడప వైసీపీలో భారీ బీటలు ఖాయమని తేలుతోంది.
కడప అంటే వైసిపి.. వైసీపీ అంటే కడప అన్న పరిస్థితి ఉండేది. క్రమేపి కడపలో వైసిపి గ్రాఫ్ తగ్గుతోంది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలతో కడప ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ కుటుంబం అడ్డగోలుగా చీలిపోవడంతో వారి బలం కూడా తగ్గింది. ఇప్పుడు షర్మిల సోదరుడు జగన్ ఎదురొడ్డేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. త్వరలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో వైసీపీలో ఒక రకమైన అభద్రతాభావం కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీలో కొనసాగేందుకు నేతలు ఇష్టపడడం లేదు. ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నవారు వైసీపీని వీడడమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు. ఎన్నికల నాటికి వైసిపి బలం నీరు గారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.