రాష్ట్రంలో దశలవారీ మద్యనిషేధం అమలు కు జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు మందుబాబులు పాలిట శాపంగా మారుతున్నాయి. అసలే కరోనా సమయం. ఏ రోజు ఎక్కడ లాక్ డౌన్ పడుతుందో తెలియదు. మద్యం షాపులు కూడా తగ్గించేశారు. ఇక దొరికే కొద్దిపాటి మద్యం కూడా పేదలకు అందుబాటులో ఉండే ధరలలో లభ్యం కావడం లేదు. మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతోంది. కానీ మద్యానికి బానిస అవుతున్న వారు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. జగన్ ఆలోచన మంచిదే అయినా దాని అమలులో మాత్రం ఎన్నో లోపాలు ఉన్నాయి.
రాష్ట్రంలో గత నెల రోజుల్లో ఏకంగా 20 మందికిపైగా శానిటైజర్ తాగి మరణించడం విశేషం. ముందుగా ప్రకాశం జిల్లాలో రెండు వేర్వేరు మండలాల్లో ఒకే సమయంలో 12 మంది చనిపోయారు. అప్పుడే ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాల్సింది. కానీ దానిని సాధారణ మరణాల లెక్కన తీసివేసింది. ఆ తర్వాత కడప జిల్లాలో ముగ్గురుతో సహా మరో ఎనిమిది మంది ఇలాగే శానిటైజర్ ప్రాణాలు వదిలారు. వాళ్ళు ఏమన్నా శానిటైజర్ రుచి మరిగి తాగారా అంటే… అదీ లేదు. కేవలం మద్యానికి బానిస అయిన వారు…. మద్యం దొరకక… తక్కువ ధరలకు లభించక శానిటైజర్ లో కూడా ఆల్కహాల్ ఉంటుందని వారు తాగడం గమనార్హం.
ఇలా కరోనా నేపథ్యంలో శానిటైజర్ వినియోగం పెరగడంతో ఇబ్బడిముబ్బడిగా నకిలీ శానిటైజర్ లు కూడా మార్కెట్లో తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. ఇక దీనిలో ఇథైల్ ఆల్కహాల్ కలిసి ఉండటంతో మందుబాబుల మత్తు కోసం తక్కువ ధరకు కొనుగోలు చేసి తాగుతున్నారు. ఇలాంటి సమయంలో మొదటిసారి మరణాలు జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి సంఘటనులు ఇకపై జరగకుండా మద్యం బానిసలకు అవగాహన కల్పిస్తూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. తాగేవారికి మరియు మానసిక స్థితి బాగలేని వారిని ఉద్దేశించి అవగాహన కార్యక్రమం కాదు కదా కనీస సమాచారం కూడా లేకుండా పోయింది. ఇక దీనికి మద్యం ధరలు అందుబాటులోకి తీసుకుని రావడం మాత్రమే ఏకైక మార్గమని పలువురు చెబుతుండగా… ఏపీ ప్రభుత్వం కూడా అందుకు తగిన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.