Dana Cyclone: మరో ఉపద్రవం.. దూసుకొస్తున్న దానా.. ఏపీకి ముప్పు, బెంగాల్, తమిళనాడు, ఒడిశా కు పొంచి ఉన్న గండం.. మొత్తం బంద్

ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కడంతో బంగాళాఖాతం సలా సలా మసులుతోంది. ఈ క్రమంలోనే వరుసగా అల్ప పీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతున్నాయి. తాజాగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది కాస్త పశ్చిమ వాయవ్యం దిశగా ప్రయాణం చేస్తోంది. మంగళవారం ఉదయం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తరకొస్తా జిల్లాలు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 1:53 pm

Dana Cyclone(2)

Follow us on

Dana Cyclone: ప్రస్తుతం తుఫాన్ గా మారిన దానా.. గురువారం నాటికి మరింత తీవ్రమైన రూపు సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం ఈ తుఫాన్ ఒడిశాలోని పారాదీప్ ప్రాంతానికి ఆగ్నేయంగా 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి ఒమన్ దేశం సూచించిన ప్రకారం “దానా” అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ బుధవారం ఉదయం నుంచి వాయవ్యంగా ప్రయాణిస్తున్నది. రేపటి నాటికి అత్యంత తీవ్ర తుఫాన్ గా వారి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 25వ తేదీ తెల్లవారుజామున ఉత్తర ఒడిశాలోని పారాదీప్ నుంచి బాలాసోర్ మధ్య తీరం దాటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫాన్ తీవ్రత నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో అన్ని ఓడరేవులలో ఒకటవ నెంబర్ భద్రత సూచికను ప్రదర్శించే జెండాను ఎగరవేశారు. తుఫాన్ తీరం దాటే 25వ తేదీన భారీగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో, కోస్తా లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీ హోంశాఖ అందుబాటులో ఉంచింది.

దానా ప్రభావంతో..

దానా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో అది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత గురువారం తెల్లవారుజామున తీవ్రమైన తుఫాన్ గా రూపాంతరం చెంది భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తుఫాన్ పదవి విధాలుగా మార్పు చెందుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల భీకరంగా గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీరం దాటిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.. తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలోని మన్యం, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ వల్ల తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పాఠశాలలకు, విద్యాలయాలకు సెలవులు ఇచ్చారు.

70 రైళ్ల రద్దు

రైల్వే శాఖ కూడా 23, 24, 25 తేదీలలో పలు రైళ్లను రద్దు చేసింది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 70 రైళ్ళను ఎక్కడికక్కడే నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో రాకపోకలు సాగించడానికి వాతావరణం అనువుగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం బెంగాల్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ సరిహద్దున ఉన్న గ్రామాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలతో సరిహద్దుగా ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని.. సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించింది. తుఫాన్ ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు అంతెత్తున ఎగిసి పడుకుంటూ వస్తున్నాయి. దీంతో తీర ప్రాంతంలోకి ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాద సూచికలను ఎగురవేశారు. తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు తమ బోట్లను సురక్షిత ప్రాంతాలలో ఉంచారు.