Dalit Bandhu: దళితబంధు (Dalit Bandhu) పథకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టడానికి నడుం బిగించిది. ఇందులో భాగంగా పథకాన్ని విస్తరించాలని బావిస్తోంది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో అమలు చేయాలని సంకల్పించింది. దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని మండలాలను ఎంపిక చేసి తన చతురతను ప్రదర్శిస్తున్నారు. సీఎం ఎంపిక చేసిన మండలాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మండలం కూడా ఉంది. దీంతో సీఎం చేతల మనిషి అని నిరూపించుకునే క్రమంలో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా హుజురాబాద్ తో పాటు సమానంగా ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక చేసి పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నియోజకవర్గాలు తెలంగాణకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉండడంతో వాటిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చాక ఈ మండలాలు ఉన్న జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించి లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. విధి విధానాలను ఖరారు చేయనున్నారు. హుజురాబాద్ లో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా ఇక్కడ కూడా తదుపరి పనులు చేపట్టాలని సూచిస్తున్నారు.
దళితబంధు పథకం రాష్ర్ట వ్యాప్తంగా విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే నాలుగు మండలాల ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా దళితబంధు పథకం వర్తింపజేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముందుకు వస్తున్నట్లు సమాచారం. దీని కోసం అహర్నిశలు కృషి చేసి అందరిలో సంతోషం నింపడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.