ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారు. అదృష్టం బాగా లేకపోతే తాడే పామై మెడకు చుట్టుకుంటుంది. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి కూడా ఇలా తయారయింది. ఏ ముహూర్తంలో దళిత బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించారే అక్కడి నుంచి కేసీఆర్ కు కష్టాలే ఎదురవుతున్నాయి. పథకం రూపకల్పన, అమలు తదితర విషయాలపై అందరికి మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు పథకం రాష్ర్టమంతా అమలు చేయాలని డిమాండ్ రావడంతో కేసీఆర్ డైలమాలో పడిపోయారు. పథకం అమలు చేయకపోతే ప్రభుత్వంపై మచ్చ పడుతుంది. చేయాలంటే లక్ష కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందనే సందేహాలు వస్తున్నాయి.
దళితబంధు అమలుపై షెడ్యూల్డ్ కులాల సమగ్రాభివృద్ధి కమిటీ రంగంలో దిగి పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గానికి కాకుండా రాష్ర్టమంతటా విస్తరించాలని పేర్కొంది. దీంతో కేసీఆర్ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుక చందంగా మారింది. నియోజకవర్గంలో మొదట 100 కుటుంబాలకు వర్తిపంజేయాలని భావించారు. ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల కమిటీ ఆగస్టు 15 లోగా పథకాన్ని రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలకు అమలు చేయాలని అల్టీమేటం జారీ చేయడంతో ఎటూ పాలుపోని పరిస్థితి.
దళితబంధు పథకం దళితులందరికీ వర్తింపజేయాలని పట్టుబట్టడంతో టీఆర్ఎస్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న రీతిలో తయారయింది. ఆగస్టు 16-31 తేదీల మధ్య దళితులదందరికి పథకం వర్తింపజేయకపోతే టీఆర్ఎస్ ను ఓడిస్తామని తెగేసి చెప్పడంతో ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశానికి ఎస్సీ కులాల మేధావులంతా సమావేశమై దళితబంధు పథకంపై తమ వైఖరి స్పష్టం చేశారు.
ఇప్పటికే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ర్ట అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దళిత బంధు పథకంపై నిప్పులు చెరిగారు. దళితులపై ఎన్నికల నేపథ్యంలో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం తీసుకురావడం ఓ సంచలనంగా మారింది. అంతే కానీ రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో దళితబంధు కేసీఆర్ కు ప్రతిబంధకం కానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో దళిత బంధు పేరుతో వారి ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్న కేసీఆర్ అంతరంగంపై ఎవరికి తెలియదని ఎవరికి వారే చెబుతున్నారు. హుజురాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించినా రాష్ర్టమంతా విస్తరించాలనే ఉద్దేశంతో నేతలు చెప్పడంతో ఎటూ పాలుపోని డైలమాలో పడిపోయారు. దళితబంధు పథకం అమలుపై ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో దాని మనుగడ ప్రశ్నార్థకమేనా అనే సందేహాలు వస్తున్నాయి.