Dalit Bandhu : ఖమ్మం జిల్లా వైరా మండలంలోని కనకగిరి సిరిపురం గ్రామంలో రెండు దళిత కాలనీవాసులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను తమ రెండు కాలనీలకు రాకుండా వెలివేస్తున్నామని దళితులు దండోరా వేసి ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీని తమ రెండు కాలనీలకు రాకుండా వెలివేయటానికి గల కారణాలు వివరిస్తూ బహిరంగంగా ఒక ప్లెక్సీని ఏర్పాటుచేశారు. ఆదివారం సిరిపురంలో ఈ రెండు దళిత కాలనీల ప్రజలు ఈ అనూహ్యా నిర్ణయాన్ని ప్రకటించారు. రెండోవిడత దళితబంధు తమ గ్రామంలోని మూడు దళిత కాలనీల మధ్య చిచ్చురేపిందని దాంతో దళితుల మధ్యనే కలహాలు ఏర్పడ్డాయని, దీనికి కారణం బీఆర్‌ఎస్ నాయకుల కుట్రలని అందువలన ఆపార్టీ నాయకులను తమ కాలనీల్లోకి రాకుండా వెలివేస్తున్నామని సిరిపురంలోని తూర్పు కాలనీ, ఇందిరమ్మకాలనీ వాసులు దండోరా వేసి ప్రకటించారు.
బీఆర్‌ఎస్‌లోని ఎమ్మెల్యే రాములునాయక్ వర్గానికి చెందిన నాయకులంతా రహాస్యంగా కుట్రపూరితంగా వ్యవహరించి దశాబ్ధాల కాలంగా కలిసిమెలిసి ఉంటున్న సిరిపురంలోని తూర్పు కాలనీ, ఇందిరమ్మకాలనీ, రాజుపేట కాలనీలను మూడుభాగాలుగా విడదీశారని ధ్వజమెత్తారు. కేవలం రాజుపేట కాలనీకి చెందిన వారినే రెండోవిడత దళితబంధు లబ్ధిదారులుగా ఎంపిక చేసి మిగిలిన తమ రెండు కాలనీలను విస్మరించి అవమానించారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ నాయకులు పక్షపాతంతో ఏకపక్షంగా రాజకీయ కుట్ర, కక్షసాధింపు చర్యలు చేపట్టి దళితబంధు పథకాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. ఈ పరిణామాలతో తమ రెండుకాలనీల్లో తీవ్ర అంతరాలు సృష్టించారని ధ్వజమెత్తారు. ఈ పరిణామం ఆత్మనూన్యాతాభావంగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఆరునెలల నుంచి అత్యంత రహాస్యంగా జరుగుతున్న రాజకీయ కుట్రల వలన తమ రెండుకాలనీల అస్థిత్వానికే భంగం వాటిల్లిందని, ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ రాక్షస చదరంగం ఆడి కాలనీలను మూడుముక్కలుగా విడదీసి ఒక్కకాలనీకి మాత్రమే కొమ్ముకాసి రెండు కాలనీవాసులను అవమానించి వెలివేశారని ధ్వజమెత్తారు. దీనికి ప్రతిగా వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే కాకుండా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరిని తూర్పు కాలనీ, ఇందిరమ్మకాలనీల్లోకి అడుగుపెట్టేందుకు వీల్లేకుండా వెలివేస్తున్నామని ప్రకటించారు. ఆ మేరకు 125మంది దళితుల సంతకాలతో కూడిన లిఖితపూ ర్వక ప్రెస్‌నోట్‌ను కూడా విడుదల చేశారు.