
Revanth Reddy: “ఆ బిజెపి నాయకులు హంగామా చేయడం తప్ప.. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ఒక పని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. ఇవ్వాల్టి వరకు ఒక అక్రమాన్ని కూడా సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. కానీ మేము అలా కాదు.. అన్ని పకడ్బందీ ఆధారాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాం. ప్రభుత్వం చేసే అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం.. అందుకే వరుస విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతున్నాం” ఇలా సాగుతున్నది రేవంత్ రెడ్డి మాట తీరు.
వాస్తవానికి గత నాలుగు రోజుల నుంచి రేవంత్ రెడ్డి వరుస ప్రెస్ మీట్ లు పెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భూసంతర్పణను వెలుగులోకి తెచ్చారు. అవి కూడా పూర్తి ఆధారాలతో.. కానీ ఇది బిజెపికి చేతకావడం లేదు. మాట్లాడితే అధికారంలోకి వస్తామని చెబుతున్న బండి సంజయ్.. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఆదును చూసి దెబ్బ కొట్టలేకపోతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి మంచి పీ ఆర్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే పూర్తి ఆధారాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాడు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం హెటిరో పార్థసారధి రెడ్డికి వందల కోట్ల విలువైన భూమిని ఎలా ఇచ్చింది, యశోద యాజమాన్యానికి వేల కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు ఎందుకు ఇచ్చింది పూసగుచ్చినట్టు రేవంత్ వివరించారు. ఫర్ డిబేట్ సేక్ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నప్పటికీ.. వారందరినీ కాచుకొని రేవంత్ ఈమాత్రం ధైర్యం చేస్తున్నారంటే అభినందించాల్సిందే. ఉదయం లేస్తే అంబానీకి దోచి పెట్టారు. ఆదానికి రాసి ఇచ్చారు అని ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ అండ్ కోకు రేవంత్ రెడ్డి భలే చురుకలు వేస్తున్నాడు. ముందు నీ నలుపు సంగతి ఏంటి ప్రశ్నిస్తున్నాడు.
ఇక రేవంత్ రెడ్డి విమర్శలు తెలంగాణ ప్రభుత్వ పెద్దలను టార్గెట్ గా చేస్తున్నవే. కెసిఆర్, కేటీఆర్ మరో ఏడుగురు ఐఏఎస్ అధికారులతో డి9 గ్యాంగ్ ఏర్పడి హైదరాబాద్ ను దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఆయన వరుస ప్రెస్మీట్ లలో వెల్లడిస్తున్న విషయాలు కూడా సంచలనంగా మారుతున్నాయి. కె.బి.ఆర్ పార్క్ పక్కన నిర్మిస్తున్న 21 అంతస్తుల భవనం గురించి పలు సంచలన విషయాలు బయటపెట్టారు. నంది నగర్ లో కేటీఆర్ నివాసానికి కొంత దూరంలో ఉండే ఈ స్థలంలో ఒకప్పుడు పురాతన భవనం ఉండేది. తనని కూలగొట్టి అక్కడ నమస్తే తెలంగాణ కార్యాలయం కడుతున్నారని ప్రచారంలో ఉండేది. ఈ స్థలం ఇప్పుడు కెసిఆర్ కుటుంబం చేతుల్లోకి వెళ్ళింది. “కుర్రా శ్రీనివాసరావు అనే వ్యక్తి కొన్న స్థలంలో నిర్మాణాల అనుమతుల కోసం కొంత భూమిని లంచంగా అడిగారు.. 20% భూమిని తీసుకున్నారు. గ్రీన్ జోన్ లో ఉన్న వారసత్వభవనాన్ని కూలగొట్టి కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఏబీఆర్ పార్కు చుట్టుపక్కల ఐదు అంతస్తుల భవనానికి అనుమతి ఇవ్వని చోట.. 21 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారు. కేవలం 3000 గజాల స్థలంలో 21 అంతస్థులకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? పక్కనే ఉన్న బసవతారకం ఆసుపత్రికి మూడు అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు. ఏడుగురు ఐఏఎస్ అధికారులు, కేసీఆర్, కేటీఆర్ కలిసి డీ9 గ్యాంగ్ గా ఏర్పడ్డారు. 21 శాతం భూములు రాసి ఇచ్చిన వారికే నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు” అంటూ రేవంత్ రెడ్డి బయటపెట్టిన విషయాలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ఈ ప్రెస్ మీట్ ను ఈనాడు, సాక్షి అంతంతమాత్రంగా ప్రచురిస్తుండగా.. ఆంధ్రజ్యోతి మాత్రం బ్యానర్ ఐటమ్ గా ప్రచురిస్తోంది. వాస్తవానికి గత ఆదివారం కొత్త పలుకులో కేసీఆర్ భూమి బద్దలు అనే శీర్షిక ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కొన్ని సంచలమైన విషయాలను కుండబద్దలు కొట్టారు. అయితే వాటిల్లో కొన్ని విషయాలను చూ చాయగా చెప్పి వదిలేశారు. అయితే ఆ వివరాలను రేవంత్ రెడ్డి ద్వారా వేమూరి రాధాకృష్ణ బయటపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే కెసిఆర్ ఆంధ్రాలో చక్రాలు తిప్పాలని ఆశ పడుతున్న నేపథ్యంలో ఆయనకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఆర్కే ఈ విధంగా కంకణం కట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ద్వారా పని చేయిస్తున్నాడు అని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.