CM Jagan: జగన్ ఈ ఫార్ములా తప్పా? రైటా?

రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో విపత్తులు విధ్వంసాన్ని సృష్టించాయి. తితలి, హుద్ హుద్, లెనిన్, తాజాగా మిచాంగ్ తుఫాన్లు కాకావికలం చేశాయి. అయితే సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో ఎన్నో రకాలుగా విపత్తులు వచ్చాయి.

Written By: Dharma, Updated On : December 9, 2023 11:55 am

CM Jagan

Follow us on

CM Jagan: తుఫాను సహాయ చర్యలు అంటే ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబు. అయితే తుఫానులే చంద్రబాబును ఓ స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడ్డాయి అన్న టాక్ ఉంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు వహించిన తొలిసారి ఒడిశాకు తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు చేసిన సాయాన్ని ఇప్పటికీ ఒడిశా వాసులు గుర్తు చేసుకుంటారు. తరువాత రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా చంద్రబాబు ముందు వరుసలో ఉండేవారు. నేరుగా తుఫాను బాధిత ప్రాంతాల్లోనే ఉండి సహాయక చర్యలు చేపట్టేవారు. అయితే ఈ విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానం.. పూర్తిగా విరుద్ధం.

రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో విపత్తులు విధ్వంసాన్ని సృష్టించాయి. తితలి, హుద్ హుద్, లెనిన్, తాజాగా మిచాంగ్ తుఫాన్లు కాకావికలం చేశాయి. అయితే సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో ఎన్నో రకాలుగా విపత్తులు వచ్చాయి. ఆ సమయంలో చంద్రబాబు స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొనేవారు. తితలి తుఫాను సమయంలో శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పది రోజులు పాటు ఉండి పోయారు. స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. హుద్ హుద్ తుఫాను సమయంలో విశాఖ నగరం నామరూపాలు లేకుండా కళా విహీనమైంది. ఆ సమయంలో చంద్రబాబు స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. నగరం యధాస్థితికి వచ్చేలా చర్యలు చేపట్టారు.

అయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో విపత్తులు వచ్చాయి. కానీ నేరుగా జగన్ సహాయక చర్యల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. సమీక్షలు నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇచ్చేవారు. నష్టపరిహారం ప్రకటించేవారు. తాజా మిచాంగ్ తుఫాను విషయంలో సైతం జగన్ పై అనేక విమర్శలు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన తరువాతే.. సీఎం జగన్ బాధితులను పరామర్శించారని.. ఏరియల్ సర్వే నిర్వహించారని.. క్షేత్రస్థాయిలోకి వచ్చి పంటలు పరిశీలించలేదని విపక్షాలు ఆరోపణలు ముమ్మరం చేశాయి. చంద్రబాబుకి.. జగన్ కి అదే తేడా అని చెప్పుకొచ్చాయి.

అయితే దీనిని వైసీపీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. విపత్తుల సమయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి ముమ్మాటికీ కరెక్టేనని వాదిస్తున్నాయి. వరద సహాయ చర్యల సమయంలో అధికార యంత్రాంగానికి పని చేసుకునేందుకు వీలుగా సీఎం జగన్ పర్యటించడం లేదని.. సచివాలయంలో ఉంటూ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని.. సహాయ చర్యల కోసం భారీగా నిధులు ప్రకటిస్తున్నారని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. నష్టపోయిన బాధితుడికి పరిహారం, తక్షణ సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.అయితే అది చాలదని.. బాధితుడికి భరోసా ఇవ్వడం కూడా ముఖ్యమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ అనుసరిస్తున్న వైఖరి.. కరెక్టా? కాదా? అన్న చర్చ అయితే బలంగా నడుస్తోంది.