Revanth Reddy Vs BRS Leaders: రోజురోజుకు రాజకీయాలంటే మరింత దారుణంగా తయారవుతున్నాయి. ఎదుటి పార్టీ నాయకుడు ఏదో ఒక కామెంట్ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూడటం.. మీడియాలో, సోషల్ మీడియాలో గాయి గాయి చేయడం పరిపాటిగా మారింది. ఒకప్పుడు ఈ పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటే.. ఇప్పుడు దాన్ని తలదన్నే రేంజ్ లో తెలంగాణ ఎదుగుతోంది. ఏమీ లేకపోయినా సరే బట్ట కాల్చి మీద వేయడం.. లీటర్ల కొద్ది బురద చల్లటం.. సంజాయిషి ఇచ్చుకునే బాధ్యత, కడుక్కునే ఖర్మ ఎదుటి వాడిది. ఒకప్పుడు తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత, సొంత మీడియాను, సోషల్ మీడియాను బలోపేతం చేసుకున్న తర్వాత.. ఇలాంటి ఎదురుదాడి పెరిగిపోయింది. విపక్ష పార్టీలో ఏ ఒక్క నాయకుడు మాట మాట్లాడినా దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఎక్కువైంది. భారత రాష్ట్ర సమితి.. మొన్నటి దాకా భారతీయ జనతా పార్టీని ఇదే విధంగా తూర్పార పట్టింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ మీద పడుతోంది. తెలంగాణలో ఇటీవల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కొంతమేర పుంజుకున్నట్టు కనిపిస్తోంది. సందు దొరికితే దానిని టాకిల్ చేస్తోంది. అందుకే దాని మీద లేనిపోని నెగిటివ్ మెసేజ్ ను జనంలోకి తీసుకెళ్తోంది. సంజాయిషీ ఇచ్చుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి వదిలేస్తోంది.
అడ్వాంటేజ్ గా తీసుకుంది
నిజానికి రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు అక్కరలేదు అనలేదు. తను చెప్పాలనుకున్నది కరెంటు కంపెనీల దగ్గర అడ్డగోలు కమీషన్లు గుంజడానికి కెసిఆర్ ఈ 24 గంటల కరెంటు అని ప్రచారం చేసుకుంటున్నాడు అని.. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన తీరు బాగాలేదు. చెప్పాల్సిన విషయాన్ని నేరుగా చెప్పకుండా, అలవాటైన రీతిలో ఏదేదో చెప్పబోయాడు. భారత రాష్ట్ర సమితికి మంచి ఛాన్స్ ఇచ్చాడు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పొందుకుంటున్న వేళ రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు. అసలే ఎదుటి పార్టీ నాయకుడు ఏమంటాడోనని ఎదురు చూసే భారత రాష్ట్ర సమితి.. తనకు అడ్వాంటేజ్ గా తీసుకుంది. సొంత మీడియాలో ఏకంగా 5 పేజీల వార్తలు కుమ్మేసింది. జిల్లా అనుబంధాల్లో కూడా పేజీలకు పేజీలు వార్తలు అచ్చేసింది. ఇక ఆ భారత రాష్ట్ర సమితి నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తించారు.
అడ్డగోలుగా ప్రచారం చేసేసింది
వాస్తవానికి తెలంగాణలో 95 శాతం చిన్న రైతులు ఉన్నారు. వీరంతా కూడా మూడు ఎకరాల లోపు భూమిలోనే వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఎకరానికి కంట చొప్పున మూడు గంటలు చాలు అన్నాడు. అక్కడే రేవంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి నాయకులకు అడ్డగోలుగా దొరికిపోయాడు. అసలే వికృత ప్రచారం చేసే భారత రాష్ట్ర సమితి.. వ్యవసాయానికి ఉచిత కరెంటు తీసేస్తారట కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటూ ఎదురుదాడికి దిగింది. పొలిటికల్ గా తనకు ఈ అవకాశం అందిరావడంతో అడ్డగోలుగా ప్రచారం చేసేసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి వంటి వారు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న వేళ తన మైలేజ్ కోసం చేయాల్సిన ప్రయత్నాలు మొత్తం చేసేసింది. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి నోటికి కాస్త కళ్లెం వేసుకుని ఉంటే బాగుండేది. వాస్తవానికి తెలంగాణకు ఇస్తున్న కరెంటు విషయంలో చాలా బొక్కలు ఉన్నాయి. ఇందులో కమీషన్లు కూడా భారీగా నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తెలివిగా తెరపైకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ వచ్చేది. కానీ ఆదరాబాదరగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి నష్టం తీసుకొచ్చింది.
ప్రచారానందాన్ని పొందింది
రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ చేయలేకపోయారు. చివరికి బో రెడ్డి అయోధ్య రెడ్డి వంటి అధికార ప్రతినిధులు సరైన వివరణ ఇచ్చారు. మీడియా మొత్తం గులాబీ రంగుతో నిండిపోయిన తర్వాత అయోధ్య రెడ్డి లాంటి వారి కౌంటర్ కు ఎలాంటి ప్రయారిటీ దక్కుతుంది? పైగా ఆ ఎన్ టీవీ, టీవీ9 ఈ వివాదాన్ని మరింత జటిలం చేశాయి.. ఒక రకంగా చెప్పాలంటే టీ న్యూస్ కంటే ఎక్కువ బాకాలు ఊదాయి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ బాధిత వర్గంలోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ ఉచిత కరెంటును తీసివేస్తారనే రాజకీయ దుమారాన్ని ప్రజలు నమ్ముతున్నారా? లేదా? అనేది తర్వాత సంగతి. భారత రాష్ట్ర సమితి మాత్రం తనకు అలవాటైన ప్రచారానందాన్ని మాత్రం పొందింది.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే విప్లవాత్మక నిర్ణయాలు
నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉచిత కరెంటు అనే పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముందుకే వెళ్ళాడు. కరెంటు కేసులు ఎత్తి వేశాడు. బకాయిలు పూర్తిగా రద్దు చేశాడు. రైతుల రుణాల మాఫీ కూడా చేశాడు. వాస్తవానికి రైతు ఊపిరి పీల్చుకున్నది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. దీన్ని ప్రచారం చేసుకునే సోయి కాంగ్రెస్ పార్టీకి లేదు. కేవలం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతోనే తామేదో రైతుల సంక్షేమం కోసం పుట్టినట్టు భారత రాష్ట్ర సమితి ప్రచారం చేసుకుంటుంది. వడ్ల రైతులను దోపిడీ చేస్తున్న మిల్లర్లు, సాగు రుణాలు మాఫీ చేయడంలో నిర్లక్ష్యం, యంత్ర లక్ష్మి, డ్రిప్ పై సబ్సిడీ వంటి వాటికి మంగళం .. ఇన్ని వైఫల్యాలు తెర ముందు కనిపిస్తున్నా భారత రాష్ట్ర సమితి తనను తాను రైతు సంక్షేమ పార్టీగా చెప్పుకోవడమే అసలైన భావ దారిద్ర్యం.