తెలుగుదేశం పార్టీ అధినేత తన విశ్వసనీయత నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయనకు వచ్చే ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నారు. విజయం దక్కాలంటే పొత్తుల వల్లనే సాధ్యం కాదని ప్రజల్లో విశ్వసనీయత లేకపోతే ఎవరితో పొత్తు పెట్టుకున్నా గెలుపు అంత సులభం కాదనే విషయం స్పష్టమవుతోంది. ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమమే కాకుండా తనపై నమ్మకం కలిగించే విధంగా చంద్రబాబు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది.
చంద్రబాబుకు 2024 ఎన్నికలు ఓ పరీక్షగా భావించుకోవాలి. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తున్నా పొత్తులు విజయవంతం అవ్వాలంటే ప్రజలకు నమ్మకం కలిగించాలి.2018 ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పడినా ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకువాలని పార్టీ సీనియర్ నేతలు సైతం చెబుతున్నారు.
ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. దాన్ని తన పరం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. జగన్ మీద అవినీతి ఆరోపణలు చేసి లాభం లేదు. ఫ్యాక్షనిస్టు ముద్ర వేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే అవి జనం పలుమార్లు విని విసిగిపోయారు. తన రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ను ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు విడమర్చి చెప్పగలగాలి.
అమరావతి రాజధానిని చూపెడితే జనం అంగీకరించరు. తాను అధికారంలోకి వస్తే పారిశ్రామికాభివృద్ధి తోపాటు సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు ఏ విధంగా అందిస్తారో చెప్పాలి. చంద్రబాబు తన పంథా మార్చుకుని ప్రజలకు అవగాహన కలిగించేలా తన పథకాల తీరుతెన్నుల గురించి క్షుణ్ణంగా విశదీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.