
Covid on Children : కరోనా మహమ్మారి తొలి విడతలో వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపింది.. సెకండ్ వేవ్ లో యువకులను ఎక్కువగానే బలి తీసుకుంది.. ఇక రాబోయే థర్డ్ వేవ్ పిల్లలపైనే అంటూ చాలా మంది వ్యాఖ్యానించారు. సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో.. థర్డ్ వేవ్ పరిస్థితి ఎలా ఉంటుంది? అనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. అందుకే.. చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారూ.. ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.
చిన్నారుల్లో కరోనా వ్యాపించడం.. వ్యాపించిన తర్వాత తీవ్రంగా ఉండడం.. రెండూ తక్కువేనని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకేసులను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతోందని వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం కరోనా బాధితుల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 1.8 శాతం మాత్రమేనని తెలిపింది. చిన్న పిల్లల్లో తక్కువగా కేసులు నమోదవుతుండగా.. వయసు పెరుగుతున్న కొద్దీ దాని తీవ్రత కనిపిస్తోందని విశ్లేషించింది.
6 నుంచి 14 సంవత్సరాల లోపు వారిలో 6.2 శాతం మందికి కరోనా సోకిందని.. అదే 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారిలో 14.3 శాతం వైరస్ సోకిందని తెలిపింది. ఇక, చిన్నారుల్లో మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉందని తెలిపింది. కరోనా కారణంగా చనిపోయిన చిన్నారుల్లో 99.8 శాతం మంది వయసు 15 సంవత్సరాలు దాటిన వారేనని తెలిపింది. గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
అయితే.. ఏడాది లోపు పిల్లల్లో మాత్రం వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటోందని తెలిపింది. మరీ ముఖ్యంగా నెల రోజుల లోపు చిన్నారుల్లో అధికంగా సమస్య ఉన్నట్టు వెల్లడించింది. 2019 డిసెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ 6వ తేదీ వరకు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను ఫైనల్ చేసినట్టు డబ్ల్యూ హెచ్ వో తెలిపింది. ఐదేళ్ల లోపు వారికి మాస్కులు అవసరం లేదన్న సంస్థ.. ఆ పై వారికి తప్పకుండా మాస్కు పెట్టాలని సూచించింది.