Covid-19 Vaccination: కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అందరికి తెలిసిందే. వైరస్ నిర్మూలనకు టీకా ఒక్కటే మార్గమని భావించి ప్రభుత్వం కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా టీకా డోసుల పంపిణీ చేపట్టింది. అనతి కాలంలోనే 100 కోట్ల మందికి టీకా అందజేసి కేంద్ర ప్రభుత్వం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీంతో ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలకే సాధ్యం కాని టీకా డోసుల పంపిణీ భారత్ అధిగమించి తన సత్తా చాటింది.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచుకుంది. గురువారం అక్టోబర్ 21 నాటికి వంద కోట్లు దాటడంపై కేంద్రం సంబరాలు జరుపుతోంది. అన్ని రైళ్లు, బస్సులు, విమానాల్లో వ్యాక్సినేషన్ విజయంపై ప్రచారం హోరెత్తించనున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకం ఎగురవేసింది. అభివృద్ధి చెందిన ఏడు దేశాలు కలిపి ఒక నెలలో ఎన్ని టీకాలు ఇచ్చాయో వాటికన్నా ఎక్కువ డోసులు మన దేశంలో వేయడం తెలిసిందే.
275 రోజుల్లో వందకోట్ల డోసులు పూర్తి చేసుకోవడంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో ఉద్యమంలా చేపట్టినందుకు అందరిని ప్రశంసించింది. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభించగా ఆగస్టు 6 నాటికి 50 కోట్లు పూర్తి చేసిన ప్రభుత్వం నేటి వరకు వంద కోట్ల డోసులు పూర్తి చేసుకోవడంపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇప్పటివరకు 31 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో దాదాపు కరోనా నిర్మూలన సాధ్యమైనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించడంలో అధికారుల పాత్ర ఎంతో ఉన్నతమైనదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరికి వ్యాక్సినేషన్ చేయడంలో ప్రభుత్వం కూడా తనదైన పాత్ర పోషించింది.