కరోనా సెకండ్ వేవ్ ఇండియా అంతటా మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో.. మళ్లీ లాక్ డౌన్ వచ్చే సూచనలు ఉన్నాయా? అనే భయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే.. కరోనాను కట్టిడి చేసేందుకు మన దేశంలో లాక్ డౌన్ విధించి సరిగ్గా సంవత్సరం గడిచింది. ఇప్పుడు మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరి, ఈ ఏడాది కాలంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటీ? మహమ్మారి రెండో దశను ఎదుర్కొనేందుకు ఉన్న ప్లాన్ ఏంటీ..?
ఒక ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులు, వాటిని అధిగమించిన తీరు, అందుకు అనుసరించిన మార్గాలు భవిష్యత్ లో మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఒకవేళ మనం సరిగా ఎదుర్కోలేకపోతే.. విజయం సాధించిన వారి అనుభవాలను పాఠాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా మొదటి దశలో వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. కానీ.. కొన్ని దేశాల్లో వైరస్ ప్రభావం కనిపించలేదు. మరికొన్ని దేశాల్లో కనిపించినా.. అక్కడి వారు సమర్థవంతంగా అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వారి నుంచి పాఠాలు తీసుకోవడం అత్యావశ్యకం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొవిడ్ ను దక్షిణ కొరియా ఎదుర్కొన్న తీరు అబ్బుర పరుస్తుంది. 5.2 కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో.. కేవలం 1,693 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులుకూడా తక్కువగా నమోదయ్యాయి. ఇదెలా సాధ్యమైందంటే.. 2015లో వణకించిన మెర్స్ అంటు వ్యాధి నుంచి వారు పాఠాలు నేర్చుకున్నారు. బీభత్సం సృష్టించిన ఆ వ్యాధి ధాటికి చాలా మంది చనిపోయారు. అప్పుడు కొరియా ప్రభుత్వం.. అంటు వ్యాధి ప్రబలకుండా 48 సంస్కరణలను అమలు చేసింది. అవే సంస్కరణలు ఇప్పుడు కొవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
ఆసుపత్రిలో పరీక్షలు చేసిన తర్వాత అనుమానం ఉన్న ప్రతీ వ్యక్తి గురించి ట్రాక్ అండ్ ట్రేస్ బృందాలు నిరంతరం టచ్ లో ఉండేవి. ఈ బృందాలకు క్రెడిట్ కార్డు, మొబైల్ ఫోను డేటాతో కూడా యాక్సెస్ ఉండేది. అంతటా ఉండే సీసీ టీవీ ఫుటేజిల ద్వారా వీధుల్లో తిరిగే వారిని నియంత్రించే వారు. ఈ దేశంలో ఒక్క కేసుకూడా నమోదు కాకముందే.. అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం.. టెస్టులు, ట్రాకింగ్, ట్రేస్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనించాల్సిన అంశం. ఈ విషయంలో ఆ దేశ ప్రధాన మంత్రి వ్యక్తిగత చొరవ తీసుకోవడం విశేషం.
ఇక, జర్మనీలో వృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వారికి సబ్సిడీతో కూడిన ట్యాక్సీ సర్వీస్ తోపాటు, ఉచిత మాస్కుల పంపిణీ, స్పెషల్ షాపింగ్ సమయాలను ఏర్పాటు చేశారు. దీంతో.. అక్కడ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ విధంగా పలు దేశాల్లోనే కాకుండా.. మన దేశంలోని కేరళ రాష్ట్రంలోనూ అద్భుతమైన చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ప్రజలను ఇళ్ల వద్దనే ఉండాలని ఆదేశించడంతోపాటు వారికి కావాల్సిన సరుకులను మాత్రం కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగులు తీసుకెళ్లి అందించేవారు. ఆ విధంగా.. దేశంలోనే తొలి కేసు నమోదైన కేరళ.. ఆ తర్వాత కేసుల నియంత్రణకు చాలా కృషి చేసింది.
ఇంకా.. ప్రపంచ దేశాల్లో చాలా వరకు వ్యాక్సినేషన్ మొదలు కాలేదు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి అయోమయంగా ఉంది. ఇలాంటి పరిస్థితి వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు ప్రభావం చూపుతాయో లేదో అనే భయం కూడా శాస్త్రవేత్తలను వెంటాడుతోంది. కాబట్టి.. సెకండ్ వేవ్ కు మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామన్నదే ఇప్పుడు కీలకం. గత అనుభవాల ద్వారా ఏం నేర్చుకున్నాం..? ఎలాంటి వ్యూహాలతో కొవిడ్ ను ఎదుర్కోబోతున్నాం అన్నది అత్యంత కీలకం.