కరోనాతో.. ప్రపంచంలోని ఏ దేశమూ చేయనటువంటి యుద్ధం చేస్తోంది భారత్. ఇప్పుడు ప్రధానంగా రెండు అవసరాల కొరత దేశాన్ని వేధిస్తోంది. రోగుల ప్రాణాలను బలిగొంటోంది! అందులో ఒకటి రెమ్ డెసివర్ ఇంజెక్షన్ల కొరత కాగా.. రెండోది అత్యంత ప్రధానమైన ఆక్సీజన్ లేమి.
ఇప్పటి వరకూ చనిపోయిన వారిలో మెజారిటీ ఆక్సీజన్ అందకనే ప్రాణాలు కోల్పోయారన్నది బాధాకరమైన వాస్తవం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.
భువనేశ్వర్ నుంచి రాష్ట్రానికి ఆక్సీజన్ ట్యాంకర్లు రావాల్సి ఉంది. అయితే.. రోడ్డు, రైలు మార్గాల్లో రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో ఎన్నో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దీంతో.. తెలంగాణ సర్కారు యుద్ధ విమానాలను వినియోగించాలని నిర్ణయించుకుంది.
ఇప్పటికే పలు విమానాలు ఖాళీ ఆక్సీజన్ ట్యాంకర్లు తీసుకొని బేగం పేట విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ బయలుదేరి వెళ్లాయి. ఈ విమానాలు 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ తీసుకొని రాబోతున్నాయి. ఇందుకోసం మొత్తం 8 ఖాళీ ట్యాంకర్లను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దేశంలో ఆక్సీజన్ కోసం యుద్ధవిమానాలను ప్రయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
రాష్ట్రంలో, దేశంలో రోజురోజుకూ పరిస్థితి విషమించుతోంది. కరోనా కల్లోలం చేయి దాటిపోతోందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు ఆలస్యంగా మేల్కోవడమే ఈ పరిస్థితి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. భారత్ పరిస్థితిని గమనించిన రష్యా సహకారం అందిచేందుకు ముందుకు వచ్చింది. రెమ్ డెసివర్ ఇంజక్షన్లతోపాటు ఆక్సీజన్ ట్యాంకర్లను పంపించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయి.