Covid-19 Blow
Covid-19 Blow : కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కలిగించిన నష్టం అపారమైనది. కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన ‘ప్రపంచ ఆరోగ్య గణాంకాలు–2025’ నివేదిక ప్రకారం, 2019–2021 మధ్య కోవిడ్ వల్ల మానవ సగటు జీవిత కాలం 1.8 సంవత్సరాలు తగ్గింది, ఇది ఆధునిక చరిత్రలో అతిపెద్ద పతనంగా నమోదైంది. ఈ మహమ్మారి ప్రజల ఆరోగ్యం, జీవన నాణ్యతను గణనీయంగా దెబ్బతీసింది. నివేదిక ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల బలహీనతలను, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలను హైలైట్ చేస్తుంది.
కోవిడ్ సంక్షోభం సమయంలో ఆందోళన, మానసిక కుంగుబాటు వంటి కారణాల వల్ల ఆరోగ్యకరమైన జీవిత కాలం ఆరు వారాలు తగ్గింది. 2019లో 73.2 సంవత్సరాలుగా ఉన్న గ్లోబల్ సగటు జీవిత కాలం 2021 నాటికి 71.4 సంవత్సరాలకు పడిపోయింది. ఈ తగ్గుదల అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమానంగా కనిపించింది, అయితే తక్కువ ఆదాయ దేశాల్లో ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. మహమ్మారి వల్ల ఆసుపత్రులు, వైద్య సౌకర్యాలపై అధిక ఒత్తిడి, ఆరోగ్య సేవల్లో అంతరాయాలు ఈ పతనానికి కారణాలుగా నివేదిక పేర్కొంది.
ఆరోగ్య రంగంలో పురోగతి..
కోవిడ్ సంక్షోభం తర్వాత కొన్ని ఆరోగ్య రంగ సాధనలు గమనార్హం. పొగతాగడం తగ్గడం, మెరుగైన వాయు నాణ్యత, సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల కారణంగా 1.4 బిలియన్ మంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే, అత్యవసర వైద్య సేవలు అందరికీ అందుబాటులో లేవు; కేవలం 431 మిలియన్ మంది మాత్రమే ఈ సేవలను పొందగలుగుతున్నారు. మాతా, శిశు మరణాలు 2000–2023 మధ్య కొంత తగ్గినప్పటికీ (మాత మరణాలు 40% తగ్గాయి), ఆశించిన స్థాయి పురోగతి సాధ్యం కాలేదు. నివేదిక ప్రకారం, 2030 నాటికి తగిన చర్యలు లేకపోతే 7 లక్షల అదనపు మాత మరణాలు, 80 లక్షల శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉంది.
Also Read : ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 శాతం మందికి కరోనా…?
ఆరోగ్య వ్యవస్థ సవాళ్లు
ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికి తగినంత నిధులు కేటాయించకపోవడం, నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కొరత ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత బాలల టీకా కవరేజ్ ఇంకా పూర్వ స్థాయికి చేరలేదు, దీనివల్ల బాలలకు రోగాల ముప్పు పెరిగింది. ప్రస్తుతం 70 ఏళ్లలోపు వారిలో హదయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, గుండెపోటు వంటివి ప్రధాన మరణ కారణాలుగా ఉన్నాయి. ఈ అసంక్రమిత వ్యాధుల నివారణకు నిధులు, అవగాహన పెంచడం అవసరమని నివేదిక సూచిస్తుంది.
భవిష్యత్ చర్యలు..
డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రభుత్వాలకు ఆరోగ్య రంగంలో పెట్టుబడులను పెంచాలని, వైద్య సిబ్బంది శిక్షణను బలోపేతం చేయాలని సూచిస్తుంది. టీకా కార్యక్రమాలను వేగవంతం చేయడం, అత్యవసర వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడం, అసంక్రమిత వ్యాధుల నివారణకు ప్రాధాన్యం ఇవ్వడం కీలకమని నొక్కి చెప్పింది. భారత్ వంటి దేశాల్లో కోవిడ్ తర్వాత ఆరోగ్య రంగంలో సంస్కరణలు అమలవుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, వైద్య సిబ్బంది కొరతను తీర్చడం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.
Web Title: Covid 19 blow long term impact on global life expectancy