Khammam Politics: “ఖమ్మం భారత రాష్ట్ర సమితిలో కొంతమంది కోవర్టు నాయకులు ఉన్నారు.. ఖమ్మంలో నన్ను పోటీ చేయకుండా నిలువరిస్తున్నారు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు..కూకట్ పల్లి కి వెళ్తానని సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. ఖమ్మంలో ఇప్పటికే రెండుసార్లు గెలిచాను.. మూడోసారి నిలబడతాను. హ్యాట్రిక్ సాధిస్తాను” నిన్న ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు.. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను పురస్కరించుకుని నిన్న నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.. పువ్వాడ అజయ్ మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు ఉన్నారు.

ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు.. తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.. 2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి నామ నాగేశ్వరరావు మీద విజయం సాధించారు.. టిఆర్ఎస్ లో చేరిన అనంతరం కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు.. బాచుపల్లి మమత హాస్పిటల్ శరవేగంగా నిర్మాణం కావడంలో కేటీఆర్ పాత్ర కూడా ఉందని అంటారు. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ ను రవాణా శాఖ రూపంలో మంత్రి పదవి వరించింది.. దీనికి తోడు తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం, నామ నాగేశ్వరరావు ఢిల్లీకే పరిమితం కావడంతో ఖమ్మం రాజకీయాలపై పువ్వాడ అజయ్ కుమార్ పెత్తనం పెరిగిపోయింది.. ఒకరకంగా చెప్పాలంటే ఒంటెత్తు పోకడలు పోయారు.. దీంతో పొంగులేటి వర్గం, ఇటు తుమ్మల వర్గం పువ్వాడ అజయ్ కుమార్ పై గుర్రుగా ఉన్నాయి. దీనికి తోడు ఆ మధ్య జరిగిన కమ్మ సంఘం ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ ప్యానెల్ ఓడిపోయింది. తుమ్మల బలపరిచిన ఎర్నేని రామారావు ప్యానల్ విజయం సాధించింది.
పొగ పెడుతున్నది ఎవరు
పువ్వాడ అజయ్ కుమార్ పెత్తనం నానాటికి పెరిగి పోతుండడంతో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు.. దీనికి తోడు పార్టీలో వర్గాలు ఎక్కువ కావడంతో ఒకటి మాట ఒకరు వినలేని పరిస్థితి ఏర్పడింది.. ఇదే క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధిష్టానం పై తిరుగుబాటు ప్రకటించారు. రేపో మాపో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని, ఆయన మీద పువ్వాడ గెలవలేడు కాబట్టి కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలను నిన్న పువ్వాడ అజయ్ కుమార్ ఖండించారు.. ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది.. మరోవైపు తాను కూడా ఖమ్మం బరిలో ఉంటానని పువ్వాడ సంకేతాలు ఇవ్వడంతో పోటీ దశావతారంగా మారే అవకాశం కనిపిస్తోంది.. అటు బిజెపి, ఇటు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ఖరారు అయిన నేపథ్యంలో… కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది.. ఒకవేళ రేణుక చౌదరి కనుక బరిలో ఉంటే అది మరింత రసవత్తరంగా మారుతుంది.