ఇప్పటికే మొండి బకాయిల (ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తులు) సమస్య, మోసాలు-కుంభకోణాలతో వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోయిన దేశీయ బ్యాంకింగ్ రంగానికి కరోనా ఉధృతి కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతున్నదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. బ్యాంకులకు సంబంధించిన ఆపరేటింగ్ ఎన్విరాన్‌మెంట్ స్కోర్‌ను ‘బీబీప్లస్’ నుంచి ‘బీబీ’ స్థాయికి ఫిచ్ కుదించింది.
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం, బ్యాంకింగ్ రంగానికి దానివల్ల కలిగే నష్టాలను బేరిజు వేసుకుని ఫిచ్ తమ రేటింగ్‌కు కోత పెట్టింది. లాక్‌డౌన్‌తో పారిశ్రామికోత్పత్తి, దేశీయ వినియోగ సామర్థ్యాలు కుంటుబడుతాయని ఫిచ్ పేర్కొన్నది. అంతిమంగా ఈ వ్యవస్థకు రుణాలిచ్చే బ్యాంకులే నష్టపోతాయని స్పష్టం చేసింది.
మరోవంక, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు ముందుగా నిర్దేశించినట్లుగానే వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విలీనాల అమలు వాయిదాపడే వీలుందా? అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాంటిదేమీ లేదన్నారు.
ఇలా ఉండగా, దేశ ఆర్థిక వ్యవస్థకు కరోనా కష్టాలు ఏర్పడిన నేపథ్యంలో ఉపశమన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ఈ ఆపత్కాలంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేయూతనిచ్చేలా కొన్ని అత్యవసర నిర్ణయాలుంటే మంచిదని అభిప్రాయపడింది. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పండా ఆర్బీఐకి ఈ మేరకు ఓ లేఖ రాసినట్లు తెలుస్తున్నది.
కొద్ది నెలలపాటు రుణాల నెలసరి చెల్లింపులను వాయిదా వేయాలంటూ బ్యాంకులకు సూచించాలని, వ్యవస్థలో నగదు కొరతను అధిగమించేలా చర్యలుండాలని, మొండి బకాయి (ఎన్‌పీఏ)ల వర్గీకరణలో సడలింపు అవసరమని సదరు లేఖలో పండా కోరారు. ఇవ్వన్నీ బ్యాంకులపై మరిన్ని భారాలను కలిగించే చర్యలే కాగలవు.
ఇలా ఉండగా, భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే సరిపోకపోవచ్చని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని బ్లూంబర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలో ఎంతోమంది పేదలున్నారని, ఇండ్లకే పరిమితం కావాలంటే సర్దుకుపోయే పరిస్థితి అందరికీ ఉండదని గుర్తుచేశారు.
సామాజిక దూరం తప్పనిసరిగా ఉన్న ఈ అంటువ్యాధి నిర్మూలనకు కలగలిసి ఉండే మురికివాడలు ఆటంకంగా ఉండే వీలుందని ఆయన పేర్కొన్నారు. మౌలిక రంగ సామర్థ్యం మెరుగుపడాలన్న ఆయన వైరస్ అంతానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.