రాజ్ భవన్ లో సిబ్బంది కరోనా బారిన పడటానికి రాష్ట్ర ఎన్నికల అధికారితో ప్రమాణ స్వీకారం చేయించడమే కారణమని మాజీ మంత్రి టీడీపీ నేత జవహర్ ఆరోపించారు. అధికారం ఉందనే పొగరుతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబందనలు తుంగలో తొక్కి కరోనా పాజిటివ్ కేసులు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని జవహర్ పేర్కొన్నారు. ఈ మేరకు తన కార్యాలయం నుంచి సోమవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం నిర్లక్షదోరణితో రాజ్ భవన్లో ఈ నెల 11న నూతన ఎన్నికల అధికారిగా కనగరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. దీని కారణంగా రాజ్ భవన్లో పనిచేసి సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత లేని జగన్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడని జవహర్ అన్నారు. విపత్కర సమయంలో చెన్నై నుంచి కనగరాజుని ఏ విధంగా తీసుకువచ్చి ఎన్నికల అధికారిగా ప్రమాణం చేయించారో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్ర నూతన ఎన్నికల అధికారి కనగరాజు క్వారంటైన్లో ఉన్నారా లేక ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్లిపోయరా అంటూ జవహర్ మండిపడ్డారు.