దేశంలో రోజు రోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రైళ్లు, బస్సులు, విమానాలవంటి ప్రజారవాణా సౌకర్యాలను ఉపయోగించుకునేటప్పుడు వైరస్ బారినపడే ప్రమాదమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణించే సమయంలో వ్యాధివ్యాప్తి ప్రమాదం ఎంత అనే దానిపై నిర్దిష్ట పరిశోధనలు లేవు. కానీ కరోనా వ్యాపిస్తున్న తీరును గమనించాక, దీన్ని మనం అంచనా వేయవచ్చు.
వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, వైరస్ గాలిలోకి వెళ్లి అది ఇతరుల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కళ్ళు, ముక్కు, నోటి ద్వారా నేరుగా, లేదంటే చేతికి అంటుకున్న కణాలు ముఖం మీద చేతులు పెట్టుకున్నప్పుడు లోపలికి ప్రవేశించవచ్చు. గాలి బయటికి వెళ్లకుండా ఉండే ప్రదేశాలలో ఈ వ్యాధి సంక్రమణకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిటికి తెరవడానికి వీలున్న ప్రజారవాణా సౌకర్యాలలో ప్రయాణం కొంత వరకు సురక్షితం. రైళ్లు, బస్సుల ద్వారా వచ్చే ప్రమాదం ఎంత అన్నది ఆయా బస్సులు, రైళ్లు, స్టేషన్లలో ఉండే రద్దీ మీద ఆధారపడి ఉంటుంది.
ఇంతకు ముందున్న ఆంక్షలను వదిలేసి, ఎవరైనా ప్రజా రవాణా సదుపాయాలను వాడుకోవచ్చని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అక్కడ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇల్లు దాటారంటే ప్రతి ఒక్కరు ఒక మీటరు దూరం నిబంధన పాటించాలి. మూసి వేసినట్లుండే ప్రజా రవాణా వ్యవస్థల్లో ఉపరితలంపై వైరస్ ఉండిపోతుంది. అయితే ఇది వ్యాప్తికి ఎంత వరకు కారణమవుతుందో కచ్చితంగా తెలియదు.