మనిషికి ఉన్న దరిద్రమైన లక్షణాల్లో ఒకటి అవసరం చూసి దెబ్బ కొట్టడం. ఇక, వ్యాపారం గురించి చెప్పాల్సిన పని ఏముంది? జనాలకు అత్యవసరం ఎంతగా ఉంటే.. వ్యాపారస్థులు అంతగా దోపిడీ చేస్తుంటారు. ఈ అమానవీయం రాజ్యమేలుతుంది కాబట్టే.. దాన్ని నిరోధించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలకు కట్టబెట్టింది రాజ్యాంగం. కానీ.. ఆ ప్రభుత్వాలు చూసీచూడనట్టు వదిలేస్తే..? పరిస్థితి ఊహకు అందకుండా ఉంటుంది. ఇప్పుడు కరోనా మందుల విషయంలో అదే పరిస్థితి నెలకొంది.
కరోనా తీవ్రత అధికమైన వారికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వారికి ఇచ్చే మందుల్లో ముఖ్యమైనది రెమ్ డెసివర్ ఇంజక్షన్. సెకండ్ వేవ్ లో శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడే కేసులే అధికంగా వెలుగు చూస్తుండడంతో రెమ్ డెసివర్ కు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో.. శవాలను పీక్కుతినే రాబంధుల్లా దోచుకుంటున్నారు మెడికల్ వ్యాపారులు.
సాధారణంగా ఒక్క రెమ్ డెసివర్ ఇంజెక్షన్ 3 వేల రూపాయల లోపు ఉంటుంది. అలాంటి ఇంజక్షన్ ను ఏకంగా 30 వేల రూపాయలకు విక్రయిస్తున్నారట! కొవిడ్ తో బాధపడే వారికి ఈ మందును ఆరు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. 18 వేలు ఖర్చు చేస్తే అందాల్సిన మందు.. ఏకంగా లక్షా 80 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కేవలం ఒక్క సూది మందుకే ఇంత ఖర్చు చేయాల్సి వస్తే.. మిగిలిన వైద్యం మాటేమిటీ? అనే ప్రశ్న తలెత్తుతోంది. సంపన్నులు అంటే.. ఎలాగోలా ఈ భారాన్ని మోయగలరని అనుకోవచ్చు. మరి సాధారణ, మధ్యతరగతి జనం పరిస్థితి ఏంటీ? ఈ మందులు కొనుగోలు చేయలేనివారు ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయట పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వాలు అంతా బాగనే ఉందని ప్రకటనలు చేస్తుండడం విశేషం. కేంద్ర ప్రభుత్వం కేవలం బెంగాల్ ఎన్నికలపై దృష్టి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతుండగా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని జనాలు మండిపడుతున్నారు. మెడికల్ దోపిడీకి ప్రభుత్వాలు లైసెన్సులు ఇచ్చాయా? అని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. మరి, దీనికి ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయో?