Corona Update: తెలుగు రాష్ట్రాలపై కరోనా ఆవహించింది. కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. ఏపీలో కల్లోలం చోటుచేసుకుంది. ఒక్కరోజులో కేసులు 7 వేల వరకూ ఎగబాకాయి. ఏకంగా నలుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే 7వేలకు చేరువలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 38055 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 6996 కరోనా కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 1066 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36108 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఒక్క రోజులో 1534 కేసులు నమోదయ్యాయి.
-తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కే కరోనా..
కరోనాపై హెచ్చరికలు చేస్తూ.. ప్రజలను అలెర్ట్ చేసే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కే కరోనా సోకింది. డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చేరుతున్నట్టు వెల్లడించారు. ‘‘హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు వెల్లడించారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు కనపడి, పరీక్ష ద్వారా నిర్ధారణ కావడం తో ముందు జాగ్రత్త గా ఐసోలేషన్ లోకి వెళ్లారు. తగిన చికిత్స కోసం నేను ఆసుపత్రి లో చేరుతున్నాను. ఏ విధమైన ఆందోళనలు,
అపోహలు వద్దనీ, త్వరలో పూర్తి స్వస్థత తో మీ ముందుకు వస్తానని తెలియచేస్తున్నట్టు’ వెల్లడించారు. అందరినీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండమని కోరుతున్నానని వెల్లడించారు.
-తెలంగాణలో విస్తృతంగా కేసులు..
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కోవిడ్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మహమ్మారి బారినపడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో దాదాపు 80 మందికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ కాగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
ఇప్పటికే ఉస్మానియా ఆస్పత్రిలో దాదాపు 180 మంది వైద్యులు, సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. నీలోఫర్ ఆస్పత్రిలోనూ 25 మందికి కోవిడ్ సోకింది. పెరుగుతున్న కరోనా కేసులకు తోడు వైద్య సిబ్బందిపై మహహ్మారి పంజా విసురుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. థర్డ్ వేవ్ రావడం ఖాయమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.