నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీల లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ప్రచారంలో అన్ని పార్టీలూ తలపడుతున్నా.. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఒక ఊపు ఊపిన బీజేపీ.. ఇక్కడ పెద్దగా ప్రభావం చూపుతున్నట్లుగా కనిపించడంలేదు.
ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంటుండడంతో పార్టీలో పోటాపోటీగా ప్రచారం నడిపిస్తున్నాయి. ఉన్న కాస్త సమయంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు హాలీయాలో సభలు నిర్వహించాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు రాకముందే టీఆర్‌ఎస్‌పార్టీ హాలియాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రేపు మరోమారు కేసీఆర్ హాలియా వేదికగా సభ నిర్వహించబోతున్నారు.
అయితే.. ఇప్పుడు ఈ సభపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. రోజూ వేలాది కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అటు కేంద్రం, వైద్యశాఖలు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా.. ఈ కరోనా వేళ బహిరంగ సభలు పెట్టడం ఏంటంటూ బహిరంగంగానే నిలదీస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఈ సభపై పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల కమిషన్ పరిశీలికులకు సైతం ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని మంత్రులు ఆరాటపడుతున్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం సీఎం సభకు జనసమీకరణ, తెరవెనుక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏకంగా 50 ఎకరాల్లో సీఎం సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు సభకు కరోనా నిబంధనలు పాటించాలని ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా.. బహిరంగ సభలో అవన్నీ సాధ్యపడుతాయా..? ఆరడుగుల డిస్టెన్స్ సభలో వర్కవుట్ అవుతుందా..? ఈ సభతో ఇంకిన్ని కరోనా కేసులు కూడా పెరిగే అవకాశాలూ లేకపోలేదు కదా..? అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఈ సభపై అటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా స్పందిస్తూ టీఆర్‌ఎస్ కరోనా నిబంధనల ఉల్లంఘనపై వీడియో, ఫొటో ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మొత్తంగా ఇంకా సభపై పెట్టిన కేసుల పీఠముడి మాత్రం వీడలేదు. ఈ నేపథ్యంలో సభకు పర్మిషన్ వస్తుందా.. లేదా అనేది తెలియకుండా ఉంది.