ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లోటు బడ్జెట్ తో రాష్ట్రపగ్గాలు చేపట్టారు. అయినప్పటికీ.. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన వద్ద ప్రణాళికలు ఏం ఉన్నాయోగానీ.. సరిగ్గా జగన్ పాలన మొదలైన నవ మాసాలకు రాష్ట్రంలో కరోనా కష్టాలు పుట్టుకొచ్చాయి. 2019 మే 30న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 2020 మార్చిలో లాక్ డౌన్ మొదలైంది.
దీంతో.. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకపోగా.. కరోనా కారణంగా లిస్టులో లేని ఖర్చులు కూడా చేయాల్సి వచ్చింది. దీంతో.. రెండు వైపులా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదనే చెప్పాలి. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడిపోయింది.
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత.. మళ్లీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అన్ని రంగాలు ఇంకా పూర్తిగా కుదురుకున్నదే లేదు. కానీ.. సెకండ్ వేవ్ మళ్లీ దూసుకొచ్చింది. ఈ సారి ఇంకా వేగంగా.. మరింత బలంగా. ప్రభుత్వం లాక్ డౌన్ విధించలేదుగానీ.. అనధికారికంగా చాలా వరకు కొనసాగుతున్న పరిస్థితి.
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అత్యవసరాలు ఉంటే వెళ్లి, ఆ పనిమాత్రం చూసుకుని వచ్చేస్తున్నారు. దీంతో.. వ్యాపారాలు వెలవెలబోతున్న పరిస్థితి. అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చాలా వరకు పనులు మందగించాయి. దీంతో.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కనిపించని భారం పడుతోంది, రాబడి చాలా వరకు తగ్గింది.
ఈ పరిస్థితి రానున్న రోజుల్లో ఇంకెలా మారుతుందో తెలియదు. పూర్తి లాక్ డౌన్ అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ జగన్ పాలనకు ప్రతికూల అంశాలే అని చెప్పక తప్పదు. మరి, వీటిని ముఖ్యమంత్రి ఎలా అధిగమిస్తారు? అన్నది చూడాలి.