తెలంగాణలో కరోనాతో వరుసగా రెండేళ్లు చదువులు అటకెక్కాయి. విద్యార్థుల భవిష్యత్తును.. వారి శ్రేణిని.. మార్కులను నిర్ధారించి భావి జీవితానికి బాటలు వేసే కీలకమైన పదోతరగతి, ఇంటర్ పరీక్షలు వరుసగా రెండేళ్లు రద్దు అయ్యాయి. వారికి మార్కులు లేకుండా కేవలం పాస్ అని మాత్రమే సర్టిఫికెట్లు వస్తాయి.
అయితే ఈ పరిణామం ఇప్పుడు విద్యార్థులకు ఊరటనిచ్చినా భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో వారు నిలదొక్కుకోవడానికి అడ్డంకులు కలిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే కరోనా బ్యాచ్ పేరిట ఇప్పటికే చదువురాని మొద్దు విద్యార్థులు, చదువే మెరిట్ విద్యార్థులు అందరూ పాస్ అయిపోయారు. దీంతో వీరిని ‘కరోనా 2020 బ్యాచ్’గా పోయిన ఏడాది అభివర్ణించారు.
ఇప్పుడు కరోనా 2021 బ్యాచ్ లో కూడా పదోతరగతి, ఇంటర్ విద్యార్థులను ప్రభుత్వాలు పాస్ అని ప్రకటించాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు. ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయించి ఈ రోజు ప్రకటించారు.
ఇప్పటికే కేంద్రప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో నిర్వహించే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈతోపాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. కరోనా సెకండ్ వేవ్ రావడంతో పరీక్షల నిర్వహణకు, విద్యార్థులతో రాయించడానికి ఏ ప్రభుత్వం సాహసించడం లేదు.
ఈ క్రమంలోనే 2020,2021 కరోనా పది, ఇంటర్ విద్యార్థుల బ్యాచ్ లకు భవిష్యత్ లో ఉద్యోగాలు పొందేటప్పుడు మెరిట్ లో తేడా కొట్టే ప్రమాదం ఉంది. వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో పది, ఇంటర్ మెమోలు కీలకంగా ఉంటాయి. అయితే అవే కరోనాతో అందరూ పాస్ కావడంతో ఈ ప్రభావం వారి భవిష్యత్ పై పడనుంది.