
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ఒక హాట్ కామెంట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఎక్కువగా చనిపోయింది వృద్ధులేనని.. 65ఏళ్లు దాటిన వారు ఈ లాక్ డౌన్ లో బయటకు రావద్దని హెచ్చరించారు. వారికి అనుమతులు కూడా ఇవ్వమని ఆయన అన్నారు. ఈ లెక్కన చంద్రబాబు సహా మన దిగ్గజ టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ నేతలంతా ఇప్పుడు కరోనా ముగిసే వరకు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. వస్తే కరోనా భయం.. రాకుంటే రాజకీయ జీవితం శూన్యం అనేలా పరిస్థితి ఉందంటున్నారు. చంద్రబాబును ఉద్దేశించే కేసీఆర్ ఇలా అన్నాడా అన్న చర్చ కూడా మొదలైంది.
* 65 ఏళ్లు దాటిన నేతలకు కరోనా కష్టం
చంద్రబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అశోక్ గజపతి రాజు, నాయిని నర్సింహారెడ్డి, డీ శ్రీనివాస్ సహా ఎంతో మంది తెలుగు రాజకీయ నాయకులకు ఇప్పుడు గడ్డు కాలం ఎదురుకానుంది. కరోనా ముఖ్యంగా 65 నిండిన వారినే తొందరగా కబళిస్తుండడం.. వారు బయట తిరగడం డేంజర్ అని చెబుతుండడంతో వారంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అందరూ బయటకు రాకుంటే పెద్దగా నష్టం లేదు. కానీ మన ఏపీ ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు బయటకు రాకపోతే ఆయన రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బ అని చెప్పకతప్పదు. ఇప్పటికే కరోనాకు భయపడి హైదరాబాద్ లోని ఇంట్లోనే పక్కరాష్ట్రంలో ఉన్నాడనే విమర్శలు బాబుపై వస్తున్నాయి. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న వేళ కూడా బాబు రాకుంటే మరిన్ని అపవాదులు తప్పవు. మరి ఈ క్లిష్ట పరిస్థితిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తిగా మారింది.
*చంద్రబాబుకు బాగా మైనస్..
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు.. దేశానికి ఎంతో మందిని పీఎంలను చేసిన వ్యక్తి ఆయన.. మరి ఈ కరోనా టైంలో ఏపీకి ఇంత కష్టం వస్తే ఆంధ్రలో ఉండలేకపోయారు. పక్క రాష్ట్రంలో సొంతింట్లో కుటుంబంతో సేదతీరుతున్నాడు. ఎమ్మెల్సీ మరియు కొడుకైన లోకేష్ బాబు కూడా హైదరాబాద్ లోనే తండ్రితోపాటు ఉన్నాడు. కనీసం ఆయన అయినా ఏపీలోకి వచ్చి పార్టీని చక్కదిద్దితే బాగుంటుందని.. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. టోటల్ ఏపీ కరోనా కష్టంలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో ఉండడం పెద్ద మైనస్ గా మారింది. దీన్నే వైసీపీ ఎలుగెత్తి చాటుతోంది.
* దీర్ఘకాలిక రోగాలుంటే మరింత కష్టం..
చంద్రబాబుకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా బీపీ, షుగర్ ఎక్కువ మోతాదులో ఉందట.. ఈ టైంలో బయటకు వస్తే డేంజర్ అని వైద్యులు సూచించినట్టు తెలిసింది. అందుకే ఇంట్లోనే ఉండండని సలహా ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అందుకే బాబు ఏపీకి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యాడని తెలుస్తోంది.
*విజయసాయిరెడ్డి సెటైర్లు
60 ఏళ్లు దాటిన వారికి కరోనా డేంజర్. ఇక షుగర్, బీపీ సహా దీర్ఘకాలిక రోగులున్న వారికి కరోనా వస్తే వారి ప్రాణాలకే ప్రమాదం. ఇటలీ, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో 80శాతం 60ఏళ్ల పైబడిన వారే. 71 ఏళ్ల చంద్రబాబుకు ఈ కరోనా మరింత డేంజర్. అందుకే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుపై సెటైర్లు వేశాడు. ‘కరోనా మనతోటే ఉంటుంది కాబట్టి 65 ఏళ్లు దాటినోళ్లు బయటకు రావద్దని కేసీఆర్ గారు కూడా చెప్పారు. జాగ్రత్త బాబూ! నీకు 71 ఏళ్లు అని వైరస్ ఇట్టే పసిగడ్తుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నేతగా పదకొండేళ్లు లాంటివి కరోనాకు అర్థం కావు.’’ అంటూ బాబును ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఇలా చంద్రబాబే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ రాజకీయ నాయకులందరూ 60 ఏళ్లకు అటూఇటూగా ఉన్నవారే. ఇలాంటి కరోనా టైంలో వారికి తీవ్రమైన కష్టం వచ్చిపడింది. రాజకీయంగా తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. మరి దాన్ని వారు ఎలా అధిగమిస్తారన్నది వేచిచూడాల్సిందే.
-నరేశ్ ఎన్నం