దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుండటంతో పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలను కుదించాలని పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. పాఠశాలలు, థియేటర్లను మూయించడంతో పాటు ఎక్కువమంది జనం గుమికూడె సమావేశాలు, ఉత్సవాలు జరపరాదని ఆంక్షలు విధిస్తు, పార్లమెంట్ సమావేశాలను మాత్రం యధావిధిగా జరపడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
ఈ విషయమై ఉంభయసభలలోని పలువురు ఎంపీలు ఆ మేరకు ప్రభుత్వానికి సూచించినా అటువంటి ఉద్దేశ్యం లేదని అంటూ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారవేస్తున్నాయి. సమావేశాలను యధావిధిగా జరపడం కోసమే ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నది.
కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చేంత వరకూ పార్లమెంటును వాయిదా వేయడం మంచిదని పలువురు ఎంపీలు ఇటు ఉభయసభల్లోనూ, బయట కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ముందుకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు ముగుస్తాయనే తాను అనుకుంటున్నట్టు అని బీజేపీ నేత ఒకరు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నందున సమావేశాల కుదింపు అనే ప్రశ్నే తలెత్తదని మరో బీజేపీ ఎంపీ చెప్పారు.
‘సభను నివరధికంగా వాయిదా వేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కరోనా వైరస్ బెడదపై పోరుకు సన్నద్ధమయ్యాం’ అని బీజేపీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. అయితే, సభ్యుల ఆరోగ్యం చిక్కుల్లో పడకుండా చూడటం కూడా పార్లమెంటు బాధ్యతని, వచ్చే వారం సభ వాయిదా పడే అవకాశం లేకపోలేదని కేంద్ర మంత్రి ఒకరు అభిప్రాయప్డడారు.
కాగా, కరోనా వైరసి వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల కొనసాగింపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏ ఎంపీ అయినా కరోనా వైరస్‌తో పార్లమెంటుకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు, వైరస్ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు ఆయనకు తెలియకపోవచ్చు కూడా. అయితే, అది ఇతర ఎంపీలకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి’ అంటూ హెచ్చరించారు.
సమూహాలకు దూరంగా ఉండమని చెబుతున్న ప్రభుత్వం ఏదో ఒక రోజు పార్లమెంటు సమావేశాల కుదింపు విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ఎంపీ బాలసుబ్రమణియన్ సైతం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, షెడ్యూల్ తేదీ కంటే ముందే పార్లమెంటును వాయిదా వేయాలని సూచించారు.