దేశంలో కరోనా నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు. శీతలపానీయాలు,ఐస్ క్రీంల జోలికి వెళ్లడం లేదు. దీంతో వాటి అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశీయ పండ్ల రసాలకు ప్రాధాన్యం ఏర్పడింది. రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాల వైపే వినియోగదారులు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా వేసవిలో ఎక్కువ మార్కెటింగ్ జరిగే కాలం కావడంతో పలు కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేస్తుంటాయి. కానీ ఈ సారి మాత్రం వినియోగదారులు శీతల పదార్థాలు, చల్లని ఐస్ క్రీం ల కోసం రావడం లేదు. దీంతో మార్కెట్లు వెలవెలబోతున్నాయి.
తగ్గిన అమ్మకాలు
ప్రతి సంవత్సరం వేసవిలో 700 కోట్ల లీటర్ల శీతల పానీయాలు అమ్ముడవుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అంత ఉండకపోవచ్చు. కేవలం 150 కోట్ల లీటర్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా ప్రభావంతోనే అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు చెబుతున్నారు. ఐస్ క్రీం ల అమ్మకాలు సైతం తగ్గాయి. ప్రజలందరు ఆరోగ్యపరిరక్షణకే పెద్దపీట వేస్తున్నారు. శీతల పానీయాలతో దగ్గు, జలుబు లాంటి వాటికి గురయ్యే ప్రమాదముందనే భావంతోనే వాటి జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా రూ. కోట్ల నష్టం కంపెనీలు భరిస్తున్నాయి. లాక్ డౌన్ ప్రభావంతోనే అమ్మకాలపై నష్టాలు సంభవిస్తున్నాయి.
ప్రజల్లో చైతన్యం
రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే శీతల పానీయాలు, ఐస్ క్రీం లను ఆశ్రయించకుండా అల్లం, పసుపు, తులసి, త్రిఫల చూర్ణం వంటి వినియోగంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఫలితంగా కరోనా రక్కసి నిరోధానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో దేశీయ ఔషధాలకు గిరాకీ ఏర్పడింది. ఆయుర్వేద దుకాణాలు కళకళలాడుతున్నాయి. కరోనా ఉధృతి పెరుగుతున్న వేళ ఔషధాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వ్యూహాలు మారుస్తున్న కంపెనీలు
కరోనా వ్యాపిస్తున్న తరుణంలో శీతల పానీయాల అమ్మకాలు తగ్గడంతో కార్పొరేట్ కంపెనీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఔషధాల తయారీపై దృష్టి సారిస్తున్నాయి. శీతల పానీయాల విక్రయాలు తగ్గిపోవడంతో ప్రజల నాడీ పట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే కూల్ కాఫీ తయారు కోసం ఉత్పత్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. దీంతో ప్రజల ఆసక్తి తెలుసుకుని మసలుకునే క్రమంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులు పెంచుకునేందుకు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా ప్రభావంతో..
కరోనా ప్రభావంతో ప్రజలజీవన విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో శీతల పానీయాలకు ఏర్పడిన గిరాకీ ప్రస్తుతం ఉండడంలేదు. దీంతో ప్రజల పంథా మారుతోంది. ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పలు విధాల పద్ధతులు పాటిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాల సేవనానికేఇష్ట పడుతున్నారు శీతల పానీయాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు.