
సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారం నానాటికీ వివాదాస్పదమవుతోంది. పట్టణంలో కొందరు ముస్లింలతో కలిసి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై బీజేపీ మండిపడుతోంది.
టిప్పు సుల్లాన్ హిందుత్వ వ్యతిరేకి అని బీజేపీ వాదిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
*అసలు వివాదం ఎందుకు?
భారతదేశాన్ని పాలించిన రాజుల్లో టిప్పు సుల్తాన్ ఒకరు. కర్ణాటకలోని మైసూర్ కేంద్రంగా పాలించారు. ఆయన చరిత్రపై ఇప్పటికీ వివాదాలున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికి వారు ఈ ముస్లిం రాజుపై చరిత్ర వక్రీకరిస్తున్నారు. ఏపీలోనూ టిప్పు సుల్తాన్ ప్రస్తావన రావడంతో బీజేపీ ఆందోళన బాటపట్టింది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న స్థానికంగా ఉండే ముస్లింలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బీజేపీ దీనిపై మండిపడుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై మండిపడ్డారు. ‘భారతీయులను కాఫిరులుగా ముద్రవేసి ఊచకోత కోసిన దుర్మార్గుడు టిప్పు సుల్తాన్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అలాంటి వ్యక్తి విగ్రహం ఏపీలో పెట్టడం తగదన్నారు. మత సామరస్యానికి మారుపేరైనా ప్రొద్దుటూరులో టిప్పు విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.
ఇక టిప్పు సుల్తాన్ లాంటి క్రూరుడి విగ్రహానికి బదులు.. భారతదేశానికి సేవ చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు సూచించారు.
ఇక ప్రొద్దుటూరులో బీజేపీ ఆందోళన బట్టింది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రొద్దుటూరుకు వచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. దీంతో ఈ ఉద్యమం మరో స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.