https://oktelugu.com/

Telangana Hospitals: కెసిఆర్ చెప్పేదంతా అబద్ధం: గుండె నొప్పి వస్తే నిమ్స్ డైరెక్టరే అపోలోకి వెళ్ళాడు

Telangana Hospitals : ఈ దేశంలో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం నేటికీ అందని ద్రాక్షే. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ వైద్యుల ముఖం చూడని పేదలు ఎంతోమంది. విద్య, వైద్యం కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా అందుతున్న ప్రయోజనం అంతంత మాత్రమే. అందుకే నేటికీ దేశంలోనూ మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. ఇందుకు ఏ రాష్ట్రమూ అతీతం కాదు. పొద్దున లేస్తే దేశానికి తెలంగాణ దిక్సూచి, వైద్యరంగం కోసం వేల […]

Written By:
  • Rocky
  • , Updated On : September 7, 2022 9:43 pm
    Follow us on

    Telangana Hospitals : ఈ దేశంలో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం నేటికీ అందని ద్రాక్షే. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ వైద్యుల ముఖం చూడని పేదలు ఎంతోమంది. విద్య, వైద్యం కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నా అందుతున్న ప్రయోజనం అంతంత మాత్రమే. అందుకే నేటికీ దేశంలోనూ మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. ఇందుకు ఏ రాష్ట్రమూ అతీతం కాదు. పొద్దున లేస్తే దేశానికి తెలంగాణ దిక్సూచి, వైద్యరంగం కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని మాట్లాడే కెసిఆర్.. తనకు చిన్న అస్వస్థత ఉన్నా వెంటనే సోమాజిగూడ యశోద ఆసుపత్రికి పరిగెడతారు. చిన్నపాటి పంటి నొప్పికి, కంటి నొప్పికి ఢిల్లీకి వెళ్తారు. తన సతీమణికి జ్వరం వస్తే ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్తారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రులు పెద్దలకు పనికిరావన్నమాట! అందులో అంతంత మాత్రపు సౌకర్యాలతోనే రోగాలు నయం చేసుకోవాలన్నమాట! కర్మ కాలిపోతే చచ్చిపోవాలన్నమాట! ఇబ్రహీంపట్నం ఘటనలో నలుగురు మహిళలు చనిపోతే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక్క పరామర్శ కూడా దక్కలేదు. పైగా బాధితులకు నిమ్స్, అపోలో లో చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా పేదలకు నాణ్యమైన వైద్యం అందడం లేదన్నది సుస్పష్టం. పైగా నీతులు వల్లించే నేతలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండడంతో ప్రభుత్వ ఆసుపత్రులపై పేదలకు నమ్మకం ఉండటం లేదు. తాజాగా గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతూ నిమ్స్ డైరెక్టర్ మనోహర్ అపోలో ఆసుపత్రిలో చేరడం మరోసారి చర్చ నియాంశమైంది.

    నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు అని 90వ దశకంలో ఓ సినీ కవి రాశాడు. సర్కారీ ఆసుపత్రులపై సమాజంలో ఉండే అభిప్రాయాన్నే ఆ సినీ తన పాట ద్వారా ప్రతిబింబించాడు. ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందదని, ప్రైవేట్ హాస్పిటల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని ఇప్పటికి ప్రజలు నమ్ముతారు. ఇలా భావించే పేద, తరగతి ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల సానుకూల దృక్పథం కలిగిన చేసేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులే ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే పరిస్థితి ఏంటి? ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, సిబ్బంది పట్ల మరింత అప నమ్మకం ఏర్పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు మాత్రమే చేయించుకుని, నాలుగు ఫోటోలకు ఫోజులిచ్చి, ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీయడం ఎంతవరకు సమంజసం? నిమ్స్ డైరెక్టర్ మనోహర్ గుండెనొప్పితో అపోలో ఆసుపత్రిలో చేరడం ఇలాంటి చర్చకు మరోసారి అవకాశం ఇచ్చింది.

    నిమ్స్ ఆస్పత్రి గురించి హైదరాబాద్ లో తెలియని వారు ఉండరు. రోజుకు వేలాదిమంది రోగులు ఈ ఆసుపత్రికి వస్తుంటారు. పైగా ప్రభుత్వం కూడా నిమ్స్ ఆసుపత్రిని రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. నిమ్స్ ఆస్పత్రిలో ఏడాదికి 47 వేల మంది ఇన్ పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నారు. ఈ సంఖ్య గతంలో 25 వేలు ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపయింది. అవుట్ పేషెంట్ల విభాగంలోనూ ఏటా ఆరు లక్షల మందికి చికిత్సలు అందిస్తుండగా, పెద్ద, చిన్న ఆపరేషన్లు 25 వేల వరకు నిర్వహిస్తున్నారు. ఏడాదికి దాదాపు మూడు లక్షల మందికి వివిధ రకాలైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలు అన్ని ఒకే చోట ఉండటం వల్ల సత్వర పరీక్షలు, నివేదికలు త్వరగా అందుతున్నాయి. ఇదంతా నిమ్స్ ఘనత. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.

    NIMS Directer

    NIMS Directer

    -పరువు పోయింది
    నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ గుండె సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతూ రెండు రోజుల క్రితం హైదర్ గూడ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఈ పరిణామం నిమ్స్ లో పనిచేసే ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమైంది. అపోలో ఆసుపత్రిలో చేరిన మనోహర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. క్యాన్సర్ చికిత్సలకు కొత్త పరికరాలు, రోబోటిక్ సర్జరీలు ఇలా అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న నిమ్స్ లో వైద్యం పొందేందుకు నిమ్స్ డైరెక్టర్ ముందుకు రాకపోవడంపై రోగులు పెదవి విరుస్తున్నారు.

    -గుండె మార్పిడి చేసిన ఆస్పత్రిలో గుండె సంబంధిత రోగానికి చికిత్స లేదా?
    నిమ్స్ లో ఇటీవల గుండె మార్పిడి జరిగింది. మలక్ పేట యశోద ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా పంజాగుట్ట నిమ్స్ కు గుండె తరలించి ఒక రోగికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరించి మరో రోగికి గుండె అమర్చి నిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. అంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు మనోహర్ వెనుక అడుగు వేయడంపై నిమ్స్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే నిమ్స్ ఉద్యోగులు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించుకున్నారు. మనోహర్ పరిణామానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయాలని అనుకున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనిపై ఒకరిద్దరు నిమ్స్ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు ఫిర్యాదు చేశారు. కాగా మనోహర్ కేవలం పరీక్షల నిమిత్తమే హైదర్ గూడ ఆసుపత్రిలో చేరారని, మా కుటుంబ సభ్యుడు ఒకరు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తుండటంతో చికిత్స పొందుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మనోహర్ వ్యవహారంపై ప్రగతి భవన్ ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.