దేశంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. కేవలం ఎన్నికలే లక్ష్యంగా పథకాలు ప్రకటిస్తుండడం కూడా ఏనాడో మొదలైంది. ఇప్పుడు ట్రెండ్ ఏమంటే.. ఎన్నికల కోసమే ఈ పథకం పెట్టామని బాజాప్తాగా ప్రకటించండం.. విమర్శించిన వారిని దబాయించడం! మొత్తానికి కేసీఆర్ ఈ పద్ధతికి శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టామని బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ పథకం కోసం లక్ష కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తామని ప్రకటించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గట్టెక్కడానికి చేసిన ఈ ప్రయత్నమే.. ఇప్పుడు టీఆర్ఎస్ కు గుదిబండగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దళితులను అభివృద్ధి చేయడానికి ఇంటికి పది లక్షల రూపాయల మేర లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. శతాబ్దాలుగా దేశంలో అణగారిన దళితులను ఉద్దరించడం మంచిదే. అయితే.. దళితుల కన్నా వెనుకబడిన వారు కూడా ఉన్నారు. లంబాడాలు, ఆదివాసీలు, ఇతర మైనారిటీలు ఈ కోవలోకి వస్తారు. మరి, దళిత బంధుతో పది లక్షలు ఇస్తున్న వీరికి ఆశ కలగడంలో తప్పేమీ లేదు కదా? కాబట్టి తమకూ ఇలాంటి పథకం ఒకటి కావాలనే డిమాండ్లు మెల్లగా మొదలవుతున్నాయి. విపక్షాలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి. కేవలం ఎన్నికల కోసం తెచ్చిన పథకంతోనే టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఒక సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. అది సక్సెస్ కావడంతో.. మరిన్ని సభలకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక, కేసీఆర్ ఎదుర్కొంటున్న మరో ముప్పు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. గురుకులాల కార్యదర్శిగా ఆయన చేసిన సేవలు అందరికీ తెలిసిందే. గురుకులం అంటే ఒకరకమైన ఏవగింపుతో చూసిన వారంతా.. తమకూ ఓ సీటు కావాలని కోరుకునే స్థాయికి తెచ్చారు. ఈ క్రమంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చారు. దీంతో.. దళిత, బహుజన వర్గాల్లో ఆయనపై ఒక నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు.. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. మనం ఇంకా బానిసలుగానే ఉండాలా? అనే ప్రశ్నకు ఆయా వర్గాల నుంచి స్పందన లభిస్తోంది. నల్గొండ సభకు వచ్చిన జనమే ఇందుకు నిదర్శనం. రాజ్యాధికారం సాధించి మన బతుకులను మనమే బాగుచేసుకోవాలని చెబుతున్న ఆయన మాటలు.. యువతలో సరికొత్త ఆలోచనను, ఆశను రగిలిస్తున్నాయి. దళిత బంధు వంటి పథకాలు శాశ్వత పరిష్కారం కాదనే మాటను కూడా చాలా మంది ఆమోదిస్తున్నారు. బీఎస్పీ అధికారం సాధిస్తుందా? అనేది పక్కన పెడితే.. కేసీఆర్ కు మాత్రం మైనస్ అయ్యే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేనిది.
అంతేకాదు.. దళితు బంధు పథకాన్ని మొత్తం దళితులకైనా అందిస్తున్నారా? అంటే అదీ లేదు. కేవలం నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే తొలివిడత ప్రయోజనం నెరవేర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం దాదాపు 12 లక్షల పైచిలుకు లబ్ధిదారులు ఉన్నారు. మరి, వీరిందరికీ ఈ పథకం అందించడం సాధ్యమేనా? అంటే.. అసాధ్యమేనని చెప్పాలి. మరి, వంద మందికి లబ్ధి చేకూర్చి, మిగిలిన దళితులకు ఒట్టిచేతులు చూపిస్తే.. అది గులాబీ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికను లక్ష్యంగా చేసుకొని ఈ పథకం వేసినప్పటికీ.. అది పారే అవకాశాలు తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగిలిన వర్గాల్లో వ్యతిరేకత రావడంతోపాటు.. దళితుల్లోనే లబ్ధి పొందలేని వారు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. జనాల్లో ఈ అసంతృప్తి, నిరసన హుజూరాబాద్ తో మొదలై.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. గులాబీ దళానికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Controversies over kcr dalit bandhu scheme
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com