TDP: తెలుగుదేశం పార్టీలో హోం మంత్రి పదవికి చాలామంది ఎదురుచూస్తున్నారు. తమ మనసులో ఉన్న మాటను బయట పెట్టేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. జనసేన తో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఆ ప్రభుత్వంలో తాము హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతామని అర్థం వచ్చేలా చాలామంది మాట్లాడుతున్నారు. తాజాగా యువ నాయకుడు నారా లోకేష్ ఇదే అర్థం ధ్వనించేలా మాట్లాడారు. ఏ ఒక్కరినీ విడిచి పెట్టమని.. తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఖాయమని చిన్న బాబు హెచ్చరించడంతో.. ఆయన త్వరలో హోం మంత్రి పదవి తీసుకుంటారని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత హోం శాఖ కీలకమైనది. ఇది అన్ని శాఖల సమాహారం. సర్వ హక్కులు ఉంటాయి ఈ శాఖకు. అందుకే ప్రభుత్వ అధినేతలు హోం మంత్రిత్వ శాఖను కేటాయించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలిమినేటి మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్ లాంటి నేతలు హోం మంత్రులుగా ఉండేవారు. ఒకానొక దశలో వీరు చంద్రబాబుకు బీట్ అవుట్ చేయడానికి ప్రయత్నించారన్న కామెంట్స్ ఉన్నాయి. అందుకే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తనకు నమ్మకస్తుడైన నిమ్మకాయల చినరాజప్పను హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు.
2019లోవైసిపి అధికారంలోకి వచ్చింది.జగన్ సీఎం అయ్యారు. కొంతమంది సీనియర్లను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కానీ హోం మంత్రి విషయంలో మాత్రం ముందు జాగ్రత్తగా ఆలోచన చేశారు. తనకు అత్యంత నమ్మకస్తురాలైన మేకతోటి సుచరితకు హోం మంత్రి బాధ్యతను అప్పగించారు. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో సైతం తానేటి వనితకు ఆ పదవి ఇచ్చారు. పేరుకే వారు మంత్రులు కానీ.. అధికారమంతా సీఎం జగన్ వద్ద ఉందన్నది బహిరంగ రహస్యమే. అయితే అటువంటి పదవి కోసం టిడిపి నేతలు ఆశలు పెట్టుకోవడం విశేషం.
టిడిపి అధికారంలోకి వస్తే తానే హోం మంత్రి పదవి చేపడతానని.. అందరి లెక్క తేలుస్తానని గతంలో కింజరాపు అచ్చెనాయుడు చెప్పుకొచ్చారు. అటు తరువాత మరో సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతం ఇదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. ఇంతలో గంటా శ్రీనివాసరావు సైతం హోం మంత్రి పదవి అయితే తనకు సూట్ అవుతుందని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లోకేష్ ఇదేవిధంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్ ఫుల్ పదవి అయిన హోం మంత్రిత్వ శాఖను లోకేష్ కి ఇస్తే కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పవు. ఇంకా జనసేనకు సీట్లు సర్దుబాటు చేయాలి. మంత్రి పదవులు కేటాయించాలి. ఇన్ని రకాల కసరత్తులు జరగాల్సి ఉన్న తరుణంలో హోం మంత్రి పదవి గురించి చర్చ తగునా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అటువంటి ఆశలు విడిచిపెట్టి ముందు పార్టీ విజయానికి పాటుపడాలని టిడిపి శ్రేణులు సూచిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Contending for the post of home minister in tdp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com