Constable Kishtaiah: తెలంగాణ స్పప్నం 1200 మంది ఆత్మబలిదానంతో సాకారం అయింది. అయితే అముల్లో కొంతమంది ప్రతీ తెలంగాణ పౌరుడి గుండెల్లో చెరగని నిలిచిపోయారు. శ్రీకాంతాచారి, డీఎస్పీ నళిని, కానిస్టేబుల్ కిష్టయ్య.. లాంటి వాళ్ల త్యాగం ఇప్పటికీ ప్రజల కళ్లముందు కదలాడుతుంది. అయితే స్వరాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ సాయం ఇంకా చాలా కుటుంబాలకు అందలేదు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకున్న డీఎస్పీ నళినికి ఇంకా ఉద్యోగం రాలేదు. కానీ తెలంగాణ అమరుడు పోలీస్ కిష్టయ్య కుటుంబానికి మాత్రం సీఎం కేసీఆర్ చేయూతనిచ్చారు. ముఖ్యమంత్రి సాయంతో కిష్టయ్య కూతురు డాక్టర్ అయింది. తన తండ్రి కళను సాకారం చేసింది.
మలిదశ ఉద్యమంలో ఆత్మబలిదానాలు..
తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అందులో ఒకరు కానిస్టేబుల్ కిష్టయ్య. సొంత రాష్ట్ర కల సాకారం కోసం సర్వీస్ రివాల్వర్‌తో తన ప్రాణాలు తృణప్రాయంగా సమర్పించారు. కిష్టయ్య మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. కేసీఆర్ ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. అవసరమైనవన్నీ సమకూర్చి అమరుడికి అసలైన నివాళి అర్పించారు. కిష్టయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. పిల్లలిద్దరి చదువుల బాధ్యత భుజానికెత్తుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన కిష్టయ్య కొడుకు రాహుల్‌కు ఎన్‌సీసీలో జూనియర్ అసిస్టెంట్‌గా కొలువు ఇప్పించారు. కూతురు ప్రియాంకను డాక్టర్‌గా చూడాలనుకున్న తండ్రి కోరిక మేరకు ఖర్చులన్నీ భరించి మెడిసిన్ చదివించారు. వైద్య విద్య పూర్తికాగానే బస్తీ దవాఖానలో ఉద్యోగం ఇప్పించారు.
మాచారెడ్డి ఠాణాలో కానిస్టేబుల్‌గా..
2009, డిసెంబర్ 1.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి మూడు రోజులైంది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిష్టయ్య తెలంగాణ కల ఎక్కడ సాకారం కాదోననే నిరాశకు గురయ్యాడు. సెల్‌టవర్ ఎక్కి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ఎవరెంత చెప్పినా టవర్ దిగిరాలేదు. ఎవరైనా దింపే ప్రయత్నం చేస్తే కాల్చేస్తానని హెచ్చరించాడు. భార్యాపిల్లలు వేడుకున్నా దిగిరాలేదు. తెలంగాణ కంటే తనకు కుటుంబం ముఖ్యం కాదని కరాఖండిగా చెప్పేశాడు. రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని వదిలేస్తానని తెగేసి చెప్పాడు. అర్ధరాత్రి 2.45 గంటలకు తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని అమరుడయ్యాడు.
భార్యకు ఉద్యోగం.. పిల్లలకు చదువు..
కిష్టయ్య చనిపోయే నాటికి ఆయనకు భార్య పద్మ, ఇద్దరు సంతానం రాహుల్, ప్రియాంక ఉన్నారు. ప్రియాంక అప్పుడు 7వ తరగతి చదువుతుంది. కిష్టయ్య ఆత్మత్యాగానికి చలించిపోయిన కేసీఆర్ ఆ క్షణమే ఆ కుటుంబ బాధ్యత తీసుకున్నారు. పిల్లలిద్దరిని చదివించారు. కిష్టయ్య భార్యకు ఇంటర్‌బోర్డులో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. కిష్టయ్య కొడుకు రాహుల్, కూతురు ప్రియాంకను కార్పొరేట్ స్కూల్‌లో చేర్పించి మంచి విద్యను అందించారు.
కొడుక్కు ఉద్యోగం.. కుతురు మెడిసిన్..
రాహుల్ ఇంటర్ పూర్తి చేయగానే నిజామాబాద్ ఎన్‌సీసీ హెడ్‌క్వార్టర్స్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పించారు. ప్రియాంకను మాత్రం ఆమె తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదివించారు. కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం తరుఫున ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించి ప్రియాంకను చదివించారు. 2021లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక.. ఏడాది పాటు చల్మెడ మెడికల్ కాలేజీలోనే హౌస్‌సర్జన్ పూర్తిచేసింది. ఇప్పుడు కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానలో కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరారు. ఈ నెల 5న మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బస్తీ దవాఖానలో వైద్యురాలిగా ప్రియాంక నిరుపేదలకు సేవలందిస్తున్నారు.