Pawan Kalyan: పవన్ పై రెడ్డి వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందా? మొత్తం రెడ్డి సామాజికవర్గానికి పవన్ ద్వేషిస్తున్నారన్న ప్రచారం మొదలుపెట్టారా? ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇష్యూ అందులో భాగమేనా? ఈ విషయంలో ముద్రగడ ఎంటరవ్వడం దేనికి సంకేతం? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశమవుతోంది. సీఎం జగన్ కమ్మ, కాపు నాయకులను టార్గెట్ చేసినప్పుడు జరగని రగడ, చంద్రబాబు రెడ్డి సామాజికవర్గంపై విమర్శలు చేసే క్రమంలో రాని అభ్యంతరాలు, పెడబొబ్బులు ఇప్పుడు పవన్ ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై చేస్తున్నప్పుడు బయటపడుతున్నాయి. అది కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమం నడిపిన ముద్రగడ నుంచి వ్యక్తమవుతుండడంతో అసలు సిసలైన ఉద్దేశ్యం కనిపిస్తోంది.
రాష్ట్రంలో అన్ని పార్టీల్లో అన్ని సామాజికవర్గాల నేతలు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ అయితే కమ్మ, వైసీపీ అయితే రెడ్డి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. అలాగని టీడీపీలో రెడ్లు ఉన్నారు. వైసీపీలో కమ్మ నేతలు కొనసాగుతున్నారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం రెడ్డి సామాజికవర్గం అంతా వైసీపీకి ఏకపక్షంగా మద్దతు పలికింది. కానీ కమ్మలు విషయానికి వచ్చేసరికి మాత్రం టీడీపీకి ఆ స్థాయిలో మద్దతు దక్కలేదు. దానికి 2014, 19 మధ్య చంద్రబాబు హయాలంలో కొన్ని నిర్ణయాలే కారణం. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు అండ్ కోపై కోపం తీసుకున్న నిర్ణయాలు కమ్మలను దూరం చేశాయి. అటు రెడ్డి సామాజికవర్గానికి సైతం జగన్ వల్ల ప్రత్యేకంగా ప్రయోజనాలేవీ లేకుండా పోయాయి. దీంతో ఆ వర్గం సైతం దూరమైంది.
ఇటువంటి తరుణంలో ఏదో రకంగా సెంటిమెంట్ రగిల్చి రెడ్డి సామాజికవర్గాన్ని తనతో కొనసాగించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అది అంతగా వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే పవన్ ద్వారా రెడ్డి సామాజికవర్గాన్ని ఐక్యం చేయాలన్నది జగన్ ఎత్తుగడ. అది కూడా కాపు నాయకుల ద్వారానే చేయాలన్నది ప్లాన్. అందుకే కాపు నేతలపై ఇతరులు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని ముద్రగడ..ఇప్పుడు రెడ్డి సామాజికవర్గానికి చెందిన ద్వారపురెడ్డిని పవన్ విమర్శిస్తే తప్పుపడుతున్నారు. కాపు ఉద్యమానికి ద్వారపురెడ్డి కుటుంబం ఎన్నో విధాలా అండగా నిలిచిందని ముద్రగడ గుర్తుచేస్తున్నారు. పట్టుసడలుతున్న రెడ్డి సామాజికవర్గం పట్టును పవన్ పై వెళ్లకుండా ఆడుతున్న నాటకంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.