Homeఆంధ్రప్రదేశ్‌Ponnur Politics: కిలారి వర్సెస్ ‘రావి’+టీడీపీ.. పొన్నూరులో వైసీపీ పతనానికి పక్కా ప్లాన్

Ponnur Politics: కిలారి వర్సెస్ ‘రావి’+టీడీపీ.. పొన్నూరులో వైసీపీ పతనానికి పక్కా ప్లాన్

Ponnur Politics: ఎప్పుడూ ఆ నియోజకవర్గంలో ‘కమ్మ’ల ఆధిపత్యమే కొనసాగేది. టీడీపీ నుంచి ఆ సీనియర్ నేత ఐదు సార్లు గెలిచి అల్లాడించాడు. ఈయన కాకపోతే వైసీపీ నుంచి మరో ‘కమ్మ’నేతనే నిలబెట్టారు. కానీ ఈసారి ధూలిపాళ్లను తిరస్కరించి ఓ కాపు నేతకు పట్టం కట్టారు.  ఓకాపు నేతకు పట్టం కట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా భావించారు. అయితే ప్రజాభిమానంతో గెలిచిన ఈ నేతపై ఇప్పుడు ఓడిన ఆ ఇద్దరూ కలిసి కుట్రలు చేస్తున్నారు. కాపు ఎమ్మెల్యేను ప్రజల్లో, పార్టీల్లో దెబ్బతీసే కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతనే ఇలా కుట్ర చేస్తుండడం.. దీనికి సదురు టీడీపీ నేత పరోక్షంగా సహకరిస్తున్న దారుణమైన పరిస్థితులు గుంటూరు జిల్లా ‘పొన్నూరు’ నియోజకవర్గంలో ఉన్నాయని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ వాళ్లు ఎవరు? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-వైసీపీ పతనానికి పక్కా ప్లాన్
పొన్నూరు నియోజకవర్గంలో వారసత్వ రాజరికాన్ని బద్దలు కొట్టి పాతికేళ్ళ పాలనను మట్టికరిపించిన కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యపై ప్రత్యర్థులు దుష్ప్రచారాలకు దిగుతున్నారు. ముఖ్యంగా పోయిన సారి వైసీపీ తరుఫున పోటీచేసి ఓడిపోయిన రావి వెంకటరమణ ఇప్పుడు తనను కాదని కిలారి వెంకట రోశయ్యకు టికెట్ ఇవ్వడాన్ని.. గెలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడన్న టాక్ నియోజకవర్గంలో ఉంది. ఆ కోపంతోనే ఇప్పుడు కిలారి కింద గోతులు తవ్వుతున్నాడని ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి పూర్తిస్థాయిలో పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు రావి వెంకట రమణ వర్గీయులు. తమ నాయకుడికి ఎటూ నియోజకవర్గంలో రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించిన రావి బ్యాచ్ తమ రహస్య మిత్రుడు, టీడీపీ నియోజకవర్గ సీనియర్ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కు మద్దతుగా వైసీపీ బలహీనపడడానికి కుట్రలు చేస్తున్నట్టు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. అవకాశం ఉంటే పొన్నూరు నియోజకవర్గంలో రావి వెంకట రమణకు.. లేనిపక్షంలో తమ ప్రత్యర్థి పార్టీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు మినహా మరొకరికి అవకాశం ఉండకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాపు నేత, ఎమ్మెల్యే కిలారిపై బురదజల్లుతున్నట్లు సమాచారం. సొంత వైసీపీ పార్టీకే రావి ఇలా ద్రోహం చేస్తున్నారని.. వైసీపీ పతనానికి కంకణం కట్టుకున్నాడని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

-రహస్య మిత్రుడు ధూళిపాళ్ల నరేంద్ర బలోపేతానికి తీవ్ర కృషి
పొన్నూరు నియోజకవర్గంలో అనాదిగా కమ్మ సామాజికవర్గ ఆధిపత్యం కొనసాగింది. ఇప్పటి వరకు 12 మంది ఎమ్మెల్యేలుగా పొన్నూరు నియోజకవర్గానికి పనిచేశారు. ధూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్‌ 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన హయాంలో చెప్పుకోదగ్గట్టుగా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఆయన సీటు కోసం సొంత‘కమ్మ’ సామాజిక వర్గాలను పెంచిపోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పనిచేసిన 25 యేళ్లలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న అపవాదు ఉంది. రాజకీయ చక్రం తిప్పిన వాళ్లలో, పై స్థాయిలో పదవులు కట్టబెట్టింది కూడా ఆయన వర్గానికే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ వేరే సామాజిక వర్గానికి రిజర్వేషన్ ప్రాతిపదికన అప్పగించినా, హవా నడిపేది మాత్రం ఈ కమ్మ సామాజిక వర్గమే. ఆయన తండ్రి స్థాపించిన సంగం డెయిరీని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే కాక, కంపెనీ యాక్టు కింద మార్చివేసి పూర్తిగా ఆయన వారసత్వం అనుభించేలా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించేసుకున్నారు.ఇప్పుడు కాపు నేత ఎమ్మెల్యే కావడంతో ధూళిపాళ్ల అసంతృప్తితో టికెట్ దక్కక రగిలిపోయిన రావి వెంకటరమణను ప్రోత్సహిస్తూ.. పరోక్ష మద్దతిస్తూ ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్యను బలహీనం చేసేందుకే కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. తాను కాకుండా మరో నేత కావడంతో రావి కూడా పార్టీ సిద్ధాంతం పక్కనపెట్టి ఎమ్మెల్యే కిలారిని ఓడించేందుకు ధూళిపాళ్లతో చేతులు కలిపి ఈ కుట్రలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర-రావి వెంకటరమణ రహస్య మిత్రులుగా ఉంటూ కాపు నేత, ఎమ్మెల్యే కిలారిని దెబ్బకొట్టడమే పనిగా పనిచేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.

-రంగంలోకి దిగిన ‘రావి’ వర్గం.. డబ్బు, మందు, బిర్యానీ ఇచ్చి మీటింగులకు మనుషుల తరలింపు
తనను కాదని గెలిచిన ఎమ్మెల్యే కిలారిని టార్గెట్ చేసిన ‘రావి’ వర్గం నియోజకవర్గంలో ఆయనను మరోసారి గెలవకుండా.. అసవరమైతే తాను గెలవకున్నా ధూళిపాళ్ల గెలిచేలా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా కలిసొచ్చే శక్తులను కలుపుకుంటూ పోదామని దీనికి సహకరిస్తున్నట్టు భోగట్టా.. కాగల కార్యం గంధర్వులే చేస్తారన్న మాదిరి.. మనం చేయాల్సిన పని ఏం లేకుండా రావి వర్గీయులే మనకు మైలేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు కదా అని వారికి పరోక్షంగా సహాయ సహకారాలను అందిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలోనే ఇటీవల పట్టణంలో రావి వర్గీయులు నిర్వహించిన సమావేశానికి ఏకంగా సహకరించి జన సమీకరణకు కూడా టీడీపీ పాల్పడిందట.. ఓ వైపు టిడిపి కార్యకర్త శంకర్.. మరోవైపు వైకాపా ముసుగులో ఉన్న టీడీపీ వీరాభిమాని బోయిన నాగరాజు కిరాణా మర్చంట్ కల్యాణ మండపంలో జరిగిన సమావేశానికి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయిల డబ్బులు, క్వార్టర్ మందు, బిర్యానీ ఇచ్చి మరీ మనుషులను తెచ్చి కుర్చీలు నింపారని కిలారి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించటానికే ఇంతలా దిగజారి డబ్బు, మందు, బిర్యానీలు పంచి మనుషులను తరలించిన వైనం విస్తుగొలుపుతోంది. కేవలం కాపు ఎమ్మెల్యే కిలారిని ఓడించడానికే ఈ కుట్రలు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. భవిష్యత్తులో ఎటువంటి నీచ రాజకీయాలకు పాల్పడతారోనని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

ఇటువంటి చెండాలపు రాజకీయాలు అవసరమా అని రావి వర్గీయులు.. వారికి సహకరిస్తున్న తెదేపా శ్రేణులపై నియోజకవర్గ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ ముసుగులో పార్టీ వినాశనానికి పాల్పడుతున్న రావి వర్గీయుల తీరును ఆ పార్టీ అభిమానులు తీవ్రంగా గర్హిస్తున్నారు. ధూళిపాళ్ల-రావి వెంకటరమణ కుట్రలను పసిగట్టిన పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వర్గం ఇప్పుడు వీరి తప్పులను ప్రజల ముందు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular