Congress Victory In Karnataka: కర్ణాటక ఫలితాలు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 114 స్థానాల్లో ముందంజలో ఉంది. జరిగితే తప్ప ఈ స్థానాల్లో బిజెపి పుంజుకోవడం కష్టమే. ఇక ఈ ఫలితాలు చూసి కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా.. బిజెపి నాయకుల్లో నైరాశ్యం అలముకుంది. ఇక ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బిజెపి నాయకులు భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి 12 సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో నాలుగు కాంగ్రెస్ వైపు, ఒకటి బిజెపి వైపు.. మిగతావన్నీ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి, హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటించాయి. ఇక ప్రతి ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. 2013లో 71.45%, 2018లో 72.36%, 2023లో దాదాపు 74% పోలింగ్ నమోదయింది. అయితే ఈ పరిణామాలు మొత్తం బిజెపి పతనానికి నాంది పలుకుతున్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
మోడీ ప్రచారం చేసినప్పటికీ..
కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. భారీగా రోడ్డు షోలలో పాల్గొన్నారు. పలు హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన మఠాలలో తిరిగారు. మత పెద్దలను కలుసుకున్నారు. అయితే ఇవేవీ కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకు రాలేకపోయాయి. మరోవైపు స్థానిక నాయకత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధినాయకత్వం గుర్తించలేకపోయింది. దీనికి తోడు చాలామంది నాయకులకు టికెట్లు ఇవ్వకపోవడంతో అది అసమ్మతికి దారి తీసింది.. కొత్తవారికి ఎక్కువ టికెట్లు ఇవ్వడంతో అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చింది.. కర్ణాటకలో ప్రయోగం చేస్తున్నామని పార్టీ ప్రకటించినప్పటికీ అది మొదట్లోనే వికటించింది. బీఎల్ సంతోష్, అమిత్ షా వంటి వారు ప్రచారం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆశించినంత స్థాయిలో ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయింది. ఇక 40% కమీషన్, స్కాన్ సీఎం అనే కాంగ్రెస్ ప్రచారాలు కూడా బిజెపికి పెద్ద ప్రతిబంధకంగా నిలిచాయి. ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒకరు లంచం తీసుకుంటూ అక్కడి దర్యాప్తు సంస్థల అధికారులకు చిక్కడం కలకలం రేపింది. ఇవన్నీ కారణాలు భారతీయ జనతా పార్టీ ఓటమికి దారి తీశాయి. అయితే ఇవి 2024లో బిజెపి ఓటమికి దారితీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
అధినాయకత్వం గుర్తించలేకపోయిందా
ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయం ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఎన్నికలకు ముందు కర్ణాటక విషయంలో ఆ ప్రయోగం చేయలేదు. బసవరాజు బొమ్మై మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. ఇక రాష్ట్రంలోని బిజెపి నాయకత్వం వర్గాలుగా విడిపోయింది. అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అధిష్టానం చెప్పలేకపోవడం ప్రజలలో ప్రతికూల సంకేతాలను ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వారంతా ఒక్కతాటిపైకి వచ్చారు. కానీ బిజెపిలో అలా లేకపోవడం ఆ పార్టీ ఓటమిని శాసించింది. దీనికి తోడు అధినాయకత్వం కూడా స్థానిక నాయకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా తానే సొంతంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే ఈ ఓటమి కేవలం కర్ణాటకతో మాత్రమే ఆగదని, 2024లో దేశం మొత్తం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ నాయకత్వం చేసిన పని చెప్పుకోకుండా ప్రధాని మ్యాజిక్ మీద ఆధారపడటం కూడా ఓటమికి ఒక కారణమని వారు తేల్చి చెబుతున్నారు.
గతంలో కూడా ఇలానే
1989 నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి. 1983 నుంచి రాష్ట్రంలో గెలిచిన పార్టీ లేదా దాని మిత్రపక్షం కేంద్రంలో ఓడిపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా దాని మిత్రపక్షం రాష్ట్రంలో ఓడిపోతుంది. 1978 నుంచి పూర్తి కాలం పాలించిన ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, సిద్ధరామయ్య మాత్రమే. సిట్టింగ్ ముఖ్యమంత్రులను ఓడించే సంప్రదాయం కర్ణాటక రాష్ట్రంలో కాస్త ఎక్కువే. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం గుండూర్, 1999 ఎన్నికల్లో జనతా దళ్ సీఎం జిహెచ్ పటేల్, 2018లో సీఎం సిద్దరామయ్య ఓడిపోయారు. 1972లో ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ కూడా ఓడిపోవలసిన వారే. కానీ ఆయన పోటీ చేయలేదు. ఆయన సొంత నియోజకవర్గం చిన్నగిరిలో పాటిల్ పార్టీ కాంగ్రెస్ ( 0_ ఆర్గనైజేషన్)/ ఎన్ సీ వో/ సిండికేట్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో ఇందిర తో కాకుండా వీరేంద్ర పాటిల్ తో ఉన్న మంత్రులు మొత్తం ఓడిపోయారు.
అప్పట్లో ముక్కోణపు పోటీ
1999 ఎన్నికల్లో మాత్రం జనతా దళ్ లో చీలిక వచ్చి జెడిఎస్, జేడీయూ గా విడి పోవడంతో చతుర్ముఖ పోటీ జరిగింది. 2004 నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ జరుగుతున్నది. కర్ణాటకలో చూసేందుకు ముక్కోణపు పోటీ అనిపించినప్పటికీ వాస్తవంలో 150 స్థానాల్లో కాంగ్రెస్ బిజెపి మధ్య, 44 స్థానాలలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పోటీ, పది స్థానాలలో జేడిఎస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ జరుగుతున్నది. మిగిలిన 30 స్థానాలలో కాంగ్రెస్, బిజెపి, జెడిఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
Bhaskar is a senior Journalist covers articles on Politics, General and entertainemnt news.
Read More