Congress- TRS Party: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీల్లో కవలరం మొదలైంది. నల్గొండ జిల్లా మునుగోడు వ్యవహారం అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతోంది. అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీకి ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ కూడా భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్ లో అదే భయం వెంటాడుతోంది. మునుగోడు వ్యవహారం రెండు పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

గతంలో నుంచే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడతారనే సంకేతాలు వచ్చాయి. అప్పుడు ఏం చెప్పారో కానీ మెత్తబడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పెద్దలకు ప్రాణసంకటంగా మారింది. పార్టీ భవితవ్యం గందరగోళంలో పడుతోంది. ఇప్పటికే పార్టీకి ఎంతో నష్టం జరగ్గా తాజాగా మునుగోడు బాగోతం కాస్త కాంగ్రెస్ పార్టీకి శిరోభారంగా మారింది. ఈనేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఎవరి మాట వినేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా రాహుల్ గాంధీ చేసిన సూచనను సైతం ఆయన పట్టించుకోవడం లేదు.
తనకు ఎవరిని కలవాల్సిన అవసరం లేదని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందనే తెలుస్తోంది. అందుకే ఆయన ఇక ఎవ్వరు చెప్పిన వినని సీతయ్యగా మారిపో యినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ భవిష్యత్ పరిణామాలపై ఆందోళన పట్టుకుంది. రాష్ట్రంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఇలాంటి వ్యవహారాలు చేటు తెస్తాయని చెబుతున్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం తన పంథా మార్చుకునేదే లేదని స్పష్టం చేస్తున్నారు.

మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైతే అది బీజేపీకి లాభం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ విజయం సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దారులు తెరిచినట్లే అని భావిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ నేతలు కూడా తమ భవిష్యత్ ఏమిటనే బెంగతోనే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీ సాధించి ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసిరే అవకాశమే ఉంది. దీంతో ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నిక ఆపాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలేవి ఫలించే సూచనలు కనిపించడం లేదు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసిపోతోంది.