Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు రోజులే గడువు ఉంది. మరోవైపు ప్రచారం మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలో అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ కాంగ్రెస్ లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్… ప్రచారంలో మొదటి నుంచి బీజేపీ కంటే.. కాంగ్రెస్‌నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కరెంటు ఉండదని, పథకాలు ఆగిపోతాయని, రాష్ట్రం పదేళ్లు వెనక్కివెళ్తుందని, మోటార్లకు మీటర్లు పెడతారని ఆరోపించాస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే అంతనా నాశనమే అంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా కాంగ్రెస్ టార్గెట్‌గానే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలా అని ఓటర్లను అడుగుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోంది. కొన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. ప్రభుత్వ ఇంటలిజెన్స్ సర్వేలో కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని వెల్లడైనట్లుల తెలుస్తోంది. అందుకే గులాబీ పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. అడపా దడపా బీజేపీని కూడా విమర్శిస్తున్నారు.
బీజేపీ టార్గెట్ కూడా..
తాజాగా ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్‌నే టార్గెట్ చేసింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గెలిచినా పరవాలేదు కానీ.. కాంగ్రెస్ గెలవ కూడదన్న లక్ష్యంతో బీజేపీ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలిస్తే దాని ప్రభావం 2024 లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని కమలం నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రధాని మోదీ నుంచి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల వరకూ అంతా కాంగ్రెస్ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబును బూచిగా..
2018 ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ చంద్రబాబును బూచిగా చూపి ఓట్లు కొల్లగొట్టారు. అప్పుడు కాంగ్రెస్–టీడీపీతోపాటు వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. దీంతో కేసీఆర్ తెలంగాణను చంద్రబాబు దోచుకునేందుకు మళ్లీ వస్తున్నారని, మహా కూటమికి ఓటు వేస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలుపుతారని భయపెట్టారు. తాజాగా బీజేపీ అదే స్ట్రాటజీని ఎంచుకుంది. నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ ఓటమి కోసం చంద్రబాబును బూచిగా చూపుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కంటే.. కేసీఆరే బెటర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా నాడు టీడీపీలో ఉన్నవారే అని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. రాష్ట్రాన్ని తీసుకెళ్లి చంద్రబాబు చేతిలో పెడతారని హెచ్చరిస్తున్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు హైదరాబాద్‌ను తానే కట్టించానని ప్రచారం చేశారని, ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తన శిష్యుడు రేవంత్‌తో టీడీపీ అధినేత చక్రం తిప్పాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మొత్తంగా, బీజేపీ, బీఆర్‌ఎస్.. తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్‌గానే ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. దీంతో మరోమారు బీఆర్‌ఎస్, బీజేపీ మైత్రి బయటపడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ–బీఆర్‌ఎస్ ఒక్కటే అని ప్రచారం చేస్తోంది. తాజాగా రెంటు పార్టీలు కాంగ్రెస్‌నే టార్గెట్ చేయడంతో వారి మైత్రి బయటపడిందని అంటున్నారు.