Homeజాతీయ వార్తలుYS Sharmila: కాంగ్రెసోళ్లు సైడ్ చేసేశారు.. వైఎస్ షర్మిలకు దారేది..?

YS Sharmila: కాంగ్రెసోళ్లు సైడ్ చేసేశారు.. వైఎస్ షర్మిలకు దారేది..?

YS Sharmila: వైఎస్సార్టీపీ అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి తనయ.. వైఎస్‌.షర్మిల పొలిటికల్‌గా సైడ్‌ అవుతున్నారా.. భవిష్యత్‌ ఏమిటో.. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారా.. అంటే అవుననే అంటున్నారు పొలిటికల్‌ ఎనలిస్టులు. తెలంగాణలో వైఎస్సార్‌ పాలన తెస్తానని అడుగు పెట్టిన షర్మిల సుమారు 3500 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు. కానీ అధినేత్రిగా ఆమెకు కూడా తగిన గుర్తింపు రాలేదు. దీంతో కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనంతోపాటుగా రాజకీయ భవిష్యత్‌ అదే పార్టీలో కొనసాగించాలని షర్మిల నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలతో ఆ ఆశలు కూడా గల్లంతయ్యాయి. అటు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తోంది. దీంతో తెలంగాణలోనే తన రాజకీయ జీవితం అని ప్రకటించిన షర్మిల భవిష్యత్‌ కార్యాచరణ ఏంటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం..
తెలంగాణలో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైఎస్‌. షర్మిల ఆశలు ఫలించే అవకాశం కనిపించటం లేదు. మరి కొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. అటు కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. వైఎస్సార్టీపీ అధినేత్రిగా షర్మిల తాను వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో తన పార్టీ అనుకున్న స్థాయిలో ఎదగకపోవటంతో కాంగ్రెస్‌లో విలీనం దిశగా కసరత్తు చేశారు. ఇందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ ద్వారా రాయభారం నడిపారు. నేరుగా సోనియా, రాహుల్‌ తో ఢిల్లీలో సమావేశమయ్యారు.

అగ్రనేతలతో భేటీ..
కాంగ్రెస్‌ అగ్రనేతలతో షర్మిల భేటీ అయినప్పుడు వైఎస్సార్‌ కుమార్తెగా షర్మిలకు సోనియా, రాహుల్‌ గౌరవం ఇచ్చారు. నాడు వైఎస్సార్‌ పేరు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చోటు చేసుకున్న పరిణామాలపైన స్పష్టత ఇచ్చారు. వారు చెప్పిన అంశాలతో వైఎస్సార్‌ పేరు సీబీఐ చార్జిషీట్లలో చేర్చటంలో వారి ప్రమేయం లేదని షర్మిల నిర్దారణకు వచ్చారు. పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని షర్మిలకు హామీ దక్కింది. అయితే, షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని స్పష్టం చేశారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌సహా మరి కొందరు తెలంగాణలో షర్మిలకు ప్రాధాన్యతపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, ఏపీలో అవకాశం కల్పిస్తామని ప్రతిపాదించారు. కానీ, షర్మిల అంగీకరించ లేదు.

తర్వాత ఏంటి?
వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌ లో విలీనం చేయటంపైన షర్మిలే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని. చర్చల్లో కీలక పాత్ర పోషించిన కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాజాగా షర్మిల ఆశించిన పాలేరు సీటును మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా ఖమ్మం సీటును మాజీ మంత్రి తుమ్మలకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి సీపీఐతో పొత్తులో భాగంగా ఇవ్వనున్నారు. దీంతో, షర్మిలకు లోక్‌సభ సీటు ఇస్తున్నారనే చర్చ సాగినా.. దాని పైనా స్పష్టత లేదు. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో షర్మిల భవిష్యత్‌ అడుగులు ఏంటి.. ఏం చేయబోతున్నారు.. కాంగ్రెస్‌ తోనే రాజకీయంగా ముందుకు వెళ్తారా..నిర్ణయంలో మార్పు ఉంటుందా అనే ఆసక్తి కొనసాగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version