Jagan Vs Congress: ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకోనుందా? సరైన సమయం చూసి బాణం విడిచిపెట్టిందా? 2024 ఎన్నికల్లో వైసిపి ఓటమే ధ్యేయమా? తద్వారా 2029 ఎన్నికల్లో తాను అధికారంలోకి రావాలనుకుంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా ఆంధ్రజ్యోతి ఆర్కే తన కాలమ్ లో ఇదే రాసుకొచ్చారు. షర్మిల విషయంలో ఆర్కే రాసిన రాతలు ఇప్పటివరకు వాస్తవాలుగా నిలిచాయి. ఇప్పుడు కూడా ఆర్కే కథనాలు నిజమేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
షర్మిల తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఆమె సేవలు ఎక్కడ వినియోగించుకోవాలన్న దానిపై ప్రతిష్టంబను కొనసాగుతోంది. ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉంటానని పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. కానీ హై కమాండ్ మాత్రం ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తొలుత అందుకు ససేమీరా అన్న షర్మిల తాజాగా మెత్తబడినట్లు సమాచారం. ఆంధ్రజ్యోతి ఆర్కే సైతం దీనిని ధ్రువీకరిస్తూ తన కాలమ్ లో అన్ని విషయాలు వెల్లడించారు. వారం, పది రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. ఇందుకుగాను ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం అప్పగిస్తారని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పర్వాలేదు అని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. షర్మిల ద్వారా ఓట్లు చీల్చి జగన్కు డామేజ్ చేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. వైసిపి ఓడితేనే కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్నది భావన. అదే జరిగితే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పట్టుదొరుకుతుంది అన్నది కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి జగనే కారణమని సోనియా అండ్ కో భావిస్తున్నారు. అందుకే జగన్ దెబ్బ కొట్టాలని నిర్ణయానికి వచ్చారు. అది షర్మిల ద్వారా సాధ్యమని భావిస్తున్నారు. అటు షర్మిల సైతం తన తండ్రికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై సాఫ్ట్ కార్నర్ ఉంది. తనను నమ్మించి మోసం చేసిన సోదరుడు జగన్ పై కోపం కూడా ఉంది. తన రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్ మంచి వేదిక అవుతుందని ఆమె భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిన వెంటనే సానుకూలంగా స్పందించారు. తన పార్టీని విలీనం చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ తో పాటు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకునేందుకు సమ్మతించినట్లు తెలుస్తోంది. ఏబీఎన్ ఆర్కే సైతం ఇదే చెబుతుండడంతో.. వాస్తవం అయి ఉండవచ్చని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.