Huzurabad Congress Candidate: హుజురాబాద్ లో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుండడంతో పార్టీల్లో ప్రచారం జోరందుకుంటోంది. టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతుండడంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనకబడిపోతోంది. ఇప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఎన్నికల్లో పోటీలో నిలుస్తుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పార్టీ మాత్రం ఇది వ్యూహాత్మకమే అని చెబుతున్నా అసలు రహస్యం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. అభ్యర్థి దొరకకనే అని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైనా ప్రకటించడంలో మాత్రం తాత్సారం చేస్తోంది.

హుజురాబాద్ లో ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. టీఆర్ఎస్ దళితబంధు పథకంతో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. బీజేపీ సానుభూతి పవనాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఇప్పటికే నియోజకర్గం చుట్టివచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం చేస్తోంది. దీంతో ఓట్లు ఏ మేరకు సాధిస్తుందో అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖకు సాయంత్రం వరకు గడువు ఇచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ కూడా హైదరాబాద్ లో మకాం వేసి సురేఖకు గడువు విధించినట్లు తెలుస్తోంది. అయితే సురేఖ కూడా అధిష్టానానికి కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. దీంతోనే అభ్యర్థి ప్రకటనలో ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అధిష్టానం కొండా సురేఖ షరతులకు ఒప్పుకుంటుందా అని అనుమానాలు వస్తున్నాయి. పోటీపై సురేఖ చెప్పే విషయాలపై సుముఖత వ్యక్తం చేస్తేనే బరిలో ఉంటానని తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. బలమైన అభ్యర్థి అయితేనే ఓట్లు రాబట్టుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న తరుణంలో సురేఖ వారి నిర్ణయంతో ఏకీభవిస్తుందా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఈటల రాజేందర్ కు ఉన్న బలం దృష్ట్యా సరైన అభ్యర్థి కోసమనే ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ వేట ప్రారంభించింది. దీటైన అభ్యర్థి కోసం ఇన్ని రోజులు ఆగింది. మరోవైపు గులాబీ పార్టీ గెలుపు కోసం మంత్రి హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్. ఆయన హుజురాబాద్ లోనే మకాం వేసి పార్టీ వర్గాలను సమాయత్తం చేస్తున్నారు. గెలుపు కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై అందరిలో ఉత్కంఠ ఏర్పడింది.