Congress – BRS : తెలంగాణ రాజకీయల్లో త్వరలో మార్పులు జరుగబోతున్నాయా? అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందా? బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది విశ్లేషకుల నుంచి. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
ఏం జరిగిందంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని రెండు రోజుల క్రితమే వచ్చారు. ఆయనను మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సీఎం నివాసానికి వెళ్లి కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. వీరంతా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేల్లో సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక కొత్త ప్రభాకర్‌రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్‌కు సన్నిహితుడు. మహిపాల్‌రెడ్డి, మణిక్‌రావు మొదటి నుంచి కేసీఆర్ వెంటనే నడుస్తున్నారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యేను కలిసిన ‘పొన్నం’
జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే కలిశారు. హైదరాబాద్ శివారులోని మైలార్‌దేవ్‌పల్లిలో ఉన్న ప్రకాశ్‌గౌడ్ నివాసానికి వెళ్లిన పొన‍్నం.. ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. అంతకుముందు ఆయన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌ను కూడా కలిశారు. వీరిద్దరినీ మంత్రి కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఆ ప్రచారానికి బలం చేకూరింది.
Political game: BRS MLAs Sunitha Lakshma Reddy (Narsapur), Kotha Prabhakar Reddy (Dubbaka), Gudem Mahipal Reddy (Patancheru) and Manik Rao (Zaheerabad) paid a courtesy call to Chief Minister Revanth Reddy at his residence. #BRS #Revanthreddy pic.twitter.com/cA3qYMo2AT
— Sudhakar Udumula (@sudhakarudumula) January 23, 2024