Haryana Elections : దేశంలోని మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. పదేళ్లుగా చాలా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో గతేడాది నుంచి హస్తం పార్టీకి మళ్లీ ఆదరణ లభిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో గెలుపు రుచి చూసిన కాంగ్రెస్ తర్వాత కర్ణాటక, తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం హర్యానాలో పాగా వేయాలని చూస్తోంది. అయితే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ఇచ్చిన హామీలే. ఎన్నికల్లో విజయం కోసం ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఇబ్బడిముబ్బడిగా ఉచిత హామీలు ఇస్తోంది. కర్ణాటకలో ఐదు గ్యారంటీల పేరుతో హామీలు ఇవ్వగా తెలంగాణలో ఆరు గ్యారంటీ హామీలతోపాటు మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చింది. ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో గెలుపు సాధ్యమైంది. ఇప్పుడు హర్యానాలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో చాలా వరకు ఉచిత హామీలే ఉన్నాయి.
హర్యానా ప్రజలకు బంపర్ ఆఫర్లు
హర్యానా రాష్ట్రానికి సబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ బుధవారం(సెప్టెంబర్ 18న) విడుదల చేసింది. ఇందులో హర్యానా ప్రజలకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మహిళలు, రైతులు, కార్మికులు, పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది. నెలకు రూ.6 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు పేదలకు 100 గజాల ఇంటి స్థలం, మహిళలకు నెలకు రూ.2 వేల ఆర్థికసాయం వంటి హామీలు ఇచ్చింది.
ఏడు గ్యాంరటీలు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చింది. ఇప్పుడు హర్యానాలో ఏడు గ్యారంటీ హామీలు ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో హర్యానా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. ఇక ఆ పార్టీ ప్రకటించిన గ్యారంటీల్లో మహిళలకు రూ.2 వేల ఆర్థికసాయం ఒకటి. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు రూ.2 వేలు ఇస్తామని తెలిపింది. అర్హులైనవారికి రూ.500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రూ.6 వేల పింఛన్, పేదలకు ఉచితంగా 100 గజాల ఇంటి స్థలం, శాశ్వత ఇంటి నిర్మాణం, చిరంజీవి పథకం కింద రూ. 25 లక్షల వరకు ఉచిత చికిత్స, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానం అమలు, ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా హర్యానాను తీర్చిదిద్దడం, క్రిమీలేయర్‌ను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు వంటి హామీలు ఉన్నాయి.