KK survey : ఏపీలో కూటమి ప్రభుత్వం తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని అనేక సర్వేలు చెప్పుకొచ్చాయి. కానీ ఎగ్జాట్ గా 161 స్థానాలు సాధిస్తుందని చెప్పిన సంస్థ మాత్రం కేకే. అంతకుముందు తెలంగాణ ఎన్నికల్లో సైతం కేకే సర్వే నిజమైంది. ఏపీ ఫలితాల్లో కేకే సర్వే చెప్పింది అక్షర సత్యం కావడంతో ఆ సంస్థ పేరు మార్మోగిపోయింది. జాతీయ స్థాయిలో సైతం చర్చకు దారితీసింది. తాజాగా కేకే సర్వే సంస్థ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కీలక సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేసింది. బిజెపి పరిస్థితిపై సంచలన విషయాలను బయటపెట్టింది. కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్ సర్వే వివరాలను వెల్లడించారు. సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను అనుసరించి దేశ రాజకీయాలు మారే అవకాశం ఉంది. గత రెండుసార్లు సులువుగా, సునాయాసంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ. ఈసారి మాత్రం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది.మిత్రపక్షాల సాయంతో మాత్రమే అధికారంలోకి రాగలిగింది. అందుకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.ఈ ఎన్నికల్లో బిజెపికి ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం ఇబ్బందికర పరిణామమే.
* హర్యానాలో బిజెపికి ఓటమి
తాజాగా కేకే సర్వే అధినేత కొండేటి కిరణ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగా హర్యానాలో బిజెపి పరిస్థితి గురించి మాట్లాడారు. ఆ రాష్ట్రంలో బిజెపి ఓడిపోతుందని తేల్చి చెప్పారు. పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో రెండింత ఓడిపోతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్,వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం చవిచూస్తుందని తేల్చి చెప్పారు. బిజెపి టైటానిక్ షిప్ అని.. మునిగిపోతున్న నావలా మారిందని కేకే వ్యాఖ్యానించడం విశేషం.
* కాంగ్రెస్ కి సానుకూలత కాదు
మరోవైపు కాంగ్రెస్ గురించి కూడా సంచలన కామెంట్స్ చేశారు. బిజెపి ఓటమి కాంగ్రెస్ కి అనుకూల అంశం తప్ప.. ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత లేదన్నారు. బిజెపి శాశ్విత ఓటు బ్యాంకు ఎటూ పోవడం లేదని.. తటస్తులు మాత్రమే ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని కేకే వివరించారు. బిజెపి వ్యతిరేక ఓటు చాలావరకు కాంగ్రెస్ కు వెళుతుందని అంచనా వేశారు. ఎక్కువ పార్టీలు పోటీలో ఉన్నా సరే.. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కలిగే ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి సింహభాగం దక్కుతుందని ప్రకటించారు.
* జాప్యంతోనే ఆప్
మరోవైపు అమ్ ఆద్మీ పార్టీ ముందుగా రంగంలో దిగి ఉంటే మరోలా ఉండేదని.. కానీ కేజ్రీవాల్ జైల్లోకి వెళ్లడం.. ఆలస్యంగా రంగంలోకి దిగడం వల్ల ఆ పార్టీకి ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని కేకే సర్వే అభిప్రాయపడింది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కేకే సర్వే.. బిజెపికి ప్రమాద ఘంటికలు తప్పవని తేల్చడంతో కాషాయ దళంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.