Homeజాతీయ వార్తలుTelangana Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ మేనియా.. కరిగిపోతున్న కేసీఆర్‌ హ్యాట్రిక్‌ స్వప్నం?

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ మేనియా.. కరిగిపోతున్న కేసీఆర్‌ హ్యాట్రిక్‌ స్వప్నం?

Telangana Congress: తెలంగాణలో ఎన్నికల రాజకీయం తారా స్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరుగుతోంది. కాంగ్రెస్‌ నేతలు తమదే అధికారం అంటూ పూర్తి విశ్వాసంతో కనిపిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ కీలక నేతలతో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. కచ్చితంగా 85 సీట్లలో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు.

చాలాచోట్ల హోరాహోరీ..
తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్‌– బీఆర్‌ఎస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ మారింది. సర్వే సంస్థలు ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు పోటీలు పడుతున్నాయి. ఎన్నికల కోడ్‌ కారణంగా సర్వేలు బయట పెట్టకపోయినా..పార్టీలకు పూర్తి సమాచారం ఇస్తున్నాయి. కాంగ్రెస్‌ తమదే అధికారం అనే ధీమాతో ఉంది. ఒక విధంగా తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న ఒక మేనియా పార్టీని కమ్మేసింది. ఇటు కేసీఆర్‌ గతం కంటేభిన్నంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. తనదైన డైలాగులు..పంచ్‌ లు..సెంటిమెంట్‌ అస్త్రాలు కనిపించటం లేదు. ప్రధానంగా పదేళ్ల కాలంలో తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలు..కరెంటు గురించి కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలు…ధరణి పోర్టల్‌ గురించే వివరిస్తున్నారు. ఓటు గురించి ఆలోచన చేయమని సూచిస్తున్నారు.

టార్గెట్‌ కేసీఆర్‌..
కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. దొరల పాలన పోవాలి.. ప్రజల పాలన రావాలని ఎన్నికల నినాదంగా మార్చుకుంటున్నారు. పార్టీ నాయకత్వం ఢిల్లీ, బెంగళూరు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ కోసం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిన ప్రకటన తమకు కలిసి వస్తుందని బీజేపీ నమ్ముతోంది. కాంగ్రెస్‌ పూర్తి భరోసాతో ఉందనే అభిప్రాయం వేళ..సీఎం కేసీఆర్‌ మాత్రం అధికారం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో అప్పుడే సీఎం సీటు కోసం నేతలు పోటీ పడుతుండటం ప్రజలు గమనిస్తున్నారని..కర్ణాటక పాలన గురించి చెప్పటం ద్వారా..అక్కడ ఎన్నికల తరువాత చోటు చేసుకున్న సీఎం సీటు పోరాటం వాళ్లకు గుర్తుకు వస్తోందని గులాబీ నేతలు చెబుతున్నారు.

సర్వేలతో అలర్ట్‌
కేసీఆర్‌ చేయించిన సర్వేల్లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావటం ఖాయమని తేలిందని పార్టీ నేతల సమాచారం. ప్రచారం చేస్తున్నట్లుగా 90 సీట్లు రాకపోయినా..75 సీట్లు ఖాయమని ఇప్పటికీ ధీమాగా చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ప్రస్తుతం ‘కేసీఆర్‌ను గెలిపించాలి – కేసీఆర్‌ను ఓడించాలి అనే అంశం పైనే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ సంక్షేమం.. ముఖ్య నేతల ప్రచారం ప్రజలను ఆకట్టుకోవటం లేదనేది వారి విశ్లేషణ. అయితే, పదేళ్ల పాలన.. కుటుంబ పాలన ఆరోపణలతో సహజంగా కనిపిస్తున్న వ్యతిరేకత..కాంగ్రెస్‌ తమ అనుకూలతగా భావిస్తోందని చెబుతున్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై వ్యతిరేకత..
ఇక బీఆర్‌ఎస్‌లో ప్రభుత్వంకన్నా.. ఆ పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రెండుమూడుసార్లు గెలిచిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో అరాచకాలు చేస్తున్నారు. కిందిస్థాయి నేతల అరాచకాలను ప్రోత్సహిస్తున్నారు. కబ్జాలు, బెదిరింపులు, అక్రమ కేసులు, పథకాల్లో వివక్ష, కమీషన్‌ ఇలా అనేకం పెరిగాయి. స్వయంగా కేసీఆర్‌ దళితబంధులో 30 శాతం కమీషన్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించడం కాంగ్రెస్‌కు బలంగా మారింది. కమీషన్‌ ప్రభుత్వం అంటూ హస్తం నేతల ప్రచారం చేస్తున్నారు.

పుంజుకున్న బీజేపీ..
ఇక తెలంగాణలో గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ బాగా పుంజుకుంది. ఈ పార్టీ ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ఓట్లనే చీలుస్తుందన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గులాబీ నేతలు కూడా ఇదే విషయంలో టెన్షన పడుతున్నారు. బీజేపీ–బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్‌కు కలిసి వస్తోందని అంటున్నారు. కుంగి కాళేశ్వరం, బుంగపడ్డ అన్నారం.. గులాబీ పార్టీకి మైనస్‌గా భావిస్తున్నారు. అందుకే కేసీఆర్‌ మూడు రోజులుగా ప్రచార సభల్లో ఆగ్రహంగా కనిపిస్తున్నారని నేతలు చెతున్నారు. తమ అభివృద్ధి గురించి ఎంత చెప్పినా నమ్మకపోవడం, విపక్షాల బలం పెరుగడం గులాబీ బాస్‌ హ్యాట్రిక్‌ సీఎం స్వప్నాన్ని చెదిరేలా చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular