
తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జల యజ్ఞంలో భాగంగా తెలంగాణలో గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు జరగట్లేదంటూ ఆరోపిస్తోన్న కాంగ్రెస్ నేతలు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ క్రమంలో గోదావరి పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా దుమ్మగూడెం ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకుని వెనక్కి వెళ్లాలని సూచించారు.
వైరాలో భట్టి విక్రమార్కను అడ్డుకోవడంతో పాటు కొత్తగూడెంలో కాంగ్రెస్ నేత వీహెచ్ ను అడ్డుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను, భద్రాచలంలో ఎమ్మెల్యే వీరయ్యను గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకేనా? అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కామారెడ్డి, నిజామాబాద్ కి నీళ్ల కోసం… కేవలం రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే 3లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లైఫ్ లైన్ అయిన… ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు కాంగ్రెస్ పార్టీ కట్టినవేనన్నారు. సెక్షన్-8 ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగించుకోవాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.