Telangana Congress: వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొని, పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్లీ పుంజుకుంటుందా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్. ఈ సారి కాకపోతే.. ఇక ఎప్పుడూ కాదు అన్నట్లుగా నేతలు తమ సహజ శైలికి భిన్నంగా ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. మరోవైపు అధికార పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మొన్నటి వరకు మంచి చోజు చూపిన బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. దీంతో ప్రత్యామ్యాయం కాంగ్రెస్ అన్న భావన ప్రజల్లో పెరుగుతోంది.
కర్ణాటక ఎన్నికల తర్వాత..
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ మార్పు కనిపిస్తోంది. కర్నాటకలో ఐక్యంగా నేతలు పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎన్నికల సమయంలో తెలంగాణ నేతలు అక్కడ ప్రచారం నిర్వహించారు. సమష్టిగా కర్ణాటకను గెలిచిన కాంగ్రెస్ తెలంగాణలోనూ పాగా వేయాలని చూస్తోంది. ఇప్పుడు అధిష్టానం పూర్తి ఫోకస్ తెలంగాణపైనే పెట్టింది.
ఐక్యంగా నేతలు..
ఇక తెలంగాణ కాంగ్రెస్ అంటేనే కయ్యాలకు కేరాఫ్.. అయితే ఇదంతా కర్ణాటక ఎన్నికలకు ముందు వరకు ఉండేది. అక్కడ ఫలితాల తర్వాత టీ కాంగ్రెస్‌లో కయ్యాలు తగ్గాయి. సర్దుకుపోవడం నేర్చుకున్నారు. ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. కలిపి పనిచేస్తామని అంటున్నారు. దీంతో ఇదే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్లస్ పాయింట్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వర్గాలుగా ఉన్న పార్టీ ఒక్కటిగా పనిచేస్తే కర్ణాటక తరహాల్లో గెలుపు ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..
ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ సర్వే కూడా కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయని అంచనా వేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా టికెట్ల కోసం నియోజకవర్గాల వారీగా సర్వే చేయిస్తోంది. దీంతో గెలుపు అవకాశాలపై ఆ పార్టీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. రాష్ట్రంలో 40 స్థానాలు కచ్చితంగా గెలుస్తామన్న ధీమా కనపిస్తోంది. మొన్నటి వరకు 30 అనుకున్న కాంగ్రెస్.. కర్ణాటక ఫలితాల తర్వాత మరో పది నియోజకవర్గాల్లో పుంచుకుంది.
బలమైన అభ్యర్థులుంటే..
ఇక 40 స్థానాలు గెలిచినా అధికారం కష్టమే. ఈ నేపథ్యంలో అధిష్టానం జాతీయ నాయకులను రంగంలోకి దింపడంతోపాటు ప్రజారంజక మేనిఫెస్టో, బలమైన అభ్యర్థుల ఎంపికతో మరో 20 సీట్లు గెలవచ్చన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఈమేరకు ప్రియాంకా గాంధీని ఎన్నికల నాటికి వీలైనన్న ఎక్కువసార్లు రాష్ట్రానికి రప్పించాలన్న ఆలోచనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ ఉన్నారు. ఈమేరకు షెడ్యూల తయారు చేసే పనిలో ఉన్నారు. మరోవైపు పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పక్క పార్టీల నుంచి కూడా లాగా ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. నేతలు గొడవలు పడకుండా ఉంటే.. తెలంగాణలోనూ కర్ణాటక తరఫా ఫలితం రిపీట్ అవుతుందని అంచనాలు వేసుకుంటున్నారు.