Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రేసులో కాంగ్రెస్ అనూహ్యంగా దూసుకువస్తోంది. ఏడాది క్రితం వరకు బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీ.. ఇప్పుడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య సాగుతోంది. కీలక సమయంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్, కర్ణాటక ఎన్నికల్లో పనిచేసిన ఫార్ములాతోనే కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, ప్రచారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది. మేనిఫెస్టోకన్నా ముందే ఆరు గ్యారంటీ హామీలతో బీఆర్‌ఎస్‌పై పైచేయి సాధించింది. బీఆర్‌ఎస్ కాంగ్రెస్ గ్యారంటీ స్కీంలను కాపీ కొట్టాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ప్రచారంలోనూ దూసుకుపోతోంది.
ఒకవైపు కేసీఆర్..
115 స్థానాలకు టికెట్లు ప్రకటించిన కేసీఆర్ ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు సగం నియోజకవర్గాలను చుట్టేశారు, ఇప్పుడు కేసీఆర్ కూడా తొలి విడత ప్రచారం పూర్తి చేసుకున్నారు. అయితే బీఆర్‌ఎస్ లో కొత్తగా వచ్చిన ఊపేమి కనిపించడం లేదు. ఆయన ప్రసంగాల్లో కొత్త విషయాలు ఏమీ లేవు. కాంగ్రెస్ వస్తే ఏదో జరుగుతుందని భయపెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ మేనిఫెస్టోను కూడా గట్టిగా ప్రచారంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు.
కాంగ్రెస్ దూకుడు..
మరో వైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోనూ జోరు పెంచుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తన సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి ఉత్తర తెలంగాణలో బస్సు యాత్ర చేశారు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకోవడంతోపాటు పదేళ్ల పాలనపై ఉండే వ్యతిరేకతను మరింత పెంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్ వినూత్న పంథాను ఎంచుకుంది. తొలుత ప్రధాన నాయకుల నియోజకవర్గాల్లో ప్రచారం మొదలెడితే, ఆ ఊపు మిగతా స్థానాల్లో కొనసాగుతుందనే వ్యూహంతో ఉంది, బహిరంగసభలకు ప్రజలు సైతం భారీగా రావడంతో కాంగ్రెస్‌లో ఉత్సాహాం కనిపిస్తోంది. టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే, డిసెంబరులో ప్రమాణం చేసేది కాంగ్రెస్సేననే ధీమాతో ఎన్నికల రణరంగంలోకి దిగారు. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత విమర్శలకు ఘాటుగానే స్పందిస్తున్నారు. దేనీకైనా రె’ఢీ’ అనే పద్ధతిలో పార్టీని నడిపిస్తున్నారు. తెలంగాణను ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అనే నినాదాన్ని ఈ ఎన్నికల్లోనూ ప్రచారంలో కాంగ్రెస్ పెడుతున్నది. దొరల తెలంగాణ మనకొద్దు, ప్రజల తెలంగాణ కావాలంటూ రాహుల్ ఇస్తున్న నినాదం ఎఫెక్టివ్‌గా మారుతోంది.
బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్.. ఎన్నికల ప్రచారం దూకుడుగా చేస్తారు. కానీ ఈసారి ఆయన డిఫెన్సివ్ ధోరణిలో రాజకీయాలు చేస్తూండటం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.