Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ కార్డుతో ముందుకు వెళ్లాలనుకుంటోంది. ఇప్పటి వరకు అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ఇవ్వన్నన్ని సీట్లు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. తొలి జాబితాలో 50 మంది పేర్లలో 20 మంది బీసీలు ఉండేలా కసరత్తు చేస్తోంది. 60 మంది తొలి జాబితాలో ఉంటే 25 మంది బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
బీసీ ముఖ్యమంత్రి కూడా..
ఇక అధికార బీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్ ప్రకటించని విధంగా బీసీ అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా బీజే పీ సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందుగా ప్రకటించదు. కానీ ఈ సంప్రదాయానికి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బ్రేక్ చేసింది. యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌ను సీఎంగా ప్రకటించడంతోపాటు డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయింది. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని చూస్తోంది. బీసీ అభ్యర్థిని సీఎంను చేస్తామని ప్రకటించడంతోపాటు డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది.
సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించే ఛాన్స్…
ఇదిలా ఉంటే బీసీ నినాదంతో ఎన్నికల్లో వెళ్లాలని భావించిన బీజేపీ బీసీని సీఎంను చేస్తామని ప్రకటించడంతోపాటు సీఎం ఎవరనేది కూడా ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో బండి సంజయ్, ఈటల రాజేందర్ పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ ఇప్పటికే పలుమార్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, రాజకీయ అంశాలపై ఆయనకు పట్టు ఉంది. బీజేపీ తరఫున హుజూరాబాద్, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధమయ్యారు. ఇందకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేసులో కూడా ఈటల పేరు వినిపిస్తోంది. ఇక బండి సంజయ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గానీ, విభజిత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఎన్నడూ లేనంతగా తెలంగాణ బీజేపీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు. గ్రామీణులకు కమలం గుర్తును పరిచయం చేశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రల ద్వారా బీజేపీకి మంచి ఊపు వచ్చింది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడంపై తెలంగాణ అంతటా నిరసన వ్యక్తమైంది. చాలా మంది బాధపడ్డారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ని కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకావం ఉందని తెలుస్తోంది.
ఆ రెండు సామాజిక వర్గాలే ఎక్కువ..
మరోవైపు బీసీ నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీ తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లు ఉండే రెండు సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగా ముదిరాజ్ సామాజికవర్గం ఓట్లను పూర్తిగా బీజేపీ వైపు తిప్పుకునేలా ఇప్పటికే బీఆర్‌ఎస్ ముదిరాజ్‌లకు టికెట్ ఇవ్వని అంశాన్ని ప్రచారం చేస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ముదిరాజ్ ఓట్లన్నీ బీజేపీకి పోలరైజ్ అవుతాయని కమలనాథులు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. బండి సంజయ్ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఆయనను కూడా సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా మున్నూరు కాపు ఓట్టు బీజేపీకి పడతాయని బీజేపీ భావిస్తోంది.