https://oktelugu.com/

దుబ్బాక తో విజయశాంతి ప్రభ వెలగబోతుందా?

తెలంగాణా కాంగ్రెస్ లో క్యాడర్ కన్నా నాయకులు ఎక్కువ. ఆంధ్రలో రాష్ట్ర విభజన తో పూర్తిగా కనుమరుగై పోయిన కాంగ్రెస్ తెలంగాణాలో మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే వచ్చింది. నిజానికి తెలంగాణా కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం అవటం, ప్రజలు కెసిఆర్ ని నమ్మటంతో కాంగ్రెస్ ఉత్తర తెలంగాణా లో  కనుమరుగయ్యింది, ప్రజలు పూర్తిగా తెరాస కి బ్రహ్మ రధం పట్టారు. అయినా దక్షిణాన కాంగ్రెస్ బలంగానే వుండేది. అధికారం లోకి రాగానే […]

Written By: , Updated On : September 3, 2020 / 06:27 AM IST
Follow us on

తెలంగాణా కాంగ్రెస్ లో క్యాడర్ కన్నా నాయకులు ఎక్కువ. ఆంధ్రలో రాష్ట్ర విభజన తో పూర్తిగా కనుమరుగై పోయిన కాంగ్రెస్ తెలంగాణాలో మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే వచ్చింది. నిజానికి తెలంగాణా కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం అవటం, ప్రజలు కెసిఆర్ ని నమ్మటంతో కాంగ్రెస్ ఉత్తర తెలంగాణా లో  కనుమరుగయ్యింది, ప్రజలు పూర్తిగా తెరాస కి బ్రహ్మ రధం పట్టారు. అయినా దక్షిణాన కాంగ్రెస్ బలంగానే వుండేది. అధికారం లోకి రాగానే కెసిఆర్ రాజకీయ చాణిక్యంతో కాంగ్రెస్ నాయకుల్ని ఆకర్షించినా కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది. ఇప్పటికీ దక్షిణాన కాంగ్రెస్ లో నాయకులకు కొదవలేదు. కాకపోతే అదే కొంప ముంచుతుంది.

Also Read : కేసీఆర్ సార్.. మీరు సాధించారు పో..!

తెలుగుదేశం నుంచి రేవంత రెడ్డి ని కాంగ్రెస్ లోకి తీసుకోవటం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. రేవంత రెడ్డి ఎక్కడున్నా నాయకత్వాన్ని చేజిక్కుంచుకోవాలని ఉవ్విళ్ళూరుతుంటాడు. కాకపోతే కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి రీసెంట్ ఎంట్రీ. రాగానే అందరినీ మించి నాయకుడు కావాలనుకుంటాడు. ఆయన ఎంట్రీ తో అరుణ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పింది. రావటమే ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు. ఇప్పుడు ఉత్తమకుమార రెడ్డి స్థానం లో ఏకంగా పిసిసి అధ్యక్షుడు కావాలని పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే ఆయన పేరు ఖరారు అయినట్లు ప్రచారం లోకి రావటం తో కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులంతా తిరుగుబాటు బావుటా ఎగరవేస్తారని వినికిడి. అదేగనక జరిగితే మేము తన కింద పనిచేయమని అధిష్టానానికి సంకేతమిచ్చారు. అందుకే అది పెండింగ్ లో పెట్టారు. దీనితో పార్టీ పని తెలంగాణా లో కుంటుపడింది.

దక్షిణాదిలో ఏదోవిధంగా పార్టీకి పూర్వ ప్రతిష్ట తీసుకురావాలని అనుకుంటున్న రాష్ట్ర నాయకులకు అఖిల భారత స్థాయిలో పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణా నాయకులందరూ సోనియా, రాహుల్ గాంధీల వెనక ర్యాలీ అయినా రాజకీయ వాతావరణం రోజు రోజుకీ మారుతుంది. డిల్లీ లో పూర్తి అధ్యక్షుడు లేకపోవటంతో అన్ని పనులు పెండింగ్ లో పడిపోయాయి. తెలంగాణా తో పాటు ఎన్నో రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించుకోలేని పరిస్థితి. ఈ లోపల బిజెపి తన పని తాను చేసుకుపోతుంది. యువ నాయకత్వాన్ని , దూకుడుగా పనిచేసే బండి సంజయ్ ని అధ్యక్షుడిగా నియమించటం తో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ప్రకటించుకొని కింద స్థాయి లో ప్రజల్లోకి వెళుతుంది. అదే కాంగ్రెస్ ఎవరు నాయకుడు అనే సంగ్దిధం లో పడి అచేతనంగా ఉండిపోయింది.

Also Read : కేసీఆర్ అన్నట్టే.. కొండంత అవినీతి?

వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేల్చుకోవటానికి బిజెపి , కాంగ్రెస్ లు సిద్ధమవుతున్నాయి. ఈ లోపల దుబ్బాక ఉపఎన్నిక లో కూడా రెండు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయశాంతి ని రంగం లోకి దించి తన బలహీనతలు కప్పిపుచ్చుకొని ఆవిడ పాపులారిటీని సొమ్ము చేసుకోవచ్చని భావిస్తుంది. ఇటీవలికాలంలో విజయశాంతి కాంగ్రెస్ లో కొనసాగటం పై పునరాలోచనలో పడిందనే వార్తలొచ్చాయి. అయితే బిజెపి లోకి తిరిగి ఎంట్రీ కి సంప్రదింపులు జరిగినా అవి ఫలప్రదం కాలేదని తెలుస్తుంది. నిజం చెప్పాలంటే బిజెపి లోకి ఏదో విధంగా ఎంట్రీ ఇచ్చుకుంటేనే విజయశాంతి కి భవిష్యత్తు వుంటుంది. ఒకవేళ కాంగ్రెస్ టికెటు సంపాదించి దుబ్బాక బరిలోకి దిగినా వచ్చే ప్రయోజనం శూన్యం. మునిగే పడవ లోకి వెళ్ళటం వలన తాత్కాలిక ప్రయోజనం అనిపించినా దీర్ఘకాలం లో తన భవిష్యత్తుకు సీలు వేసుకున్నట్లే. ఒకవేళ గెలిచినా ఏమవుతుంది? పైన పరిస్థితులు బాగాలేనప్పుడు, ఇక్కడ పార్టీ భవిష్యత్తు అంధకారంగా వున్నప్పుడు కొన్నాళ్ళు ఆగైనా బిజెపి లోకి ఎంట్రీ ఇచ్చుకోవటమే మంచిది. లేకపోతే శాశ్వతంగా నష్టపోవటం ఖాయం.

ఇక రాష్ట్ర అధ్యక్షుడి స్థానానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి అయితే తిరిగి పార్టీలో నూతనోత్సాహం తీసుకొస్తాడని అధిష్టానం భావించటం లో అర్ధముంది. ఇప్పుడున్న నాయకుల్లో ఎవరికీ జనంలో గుడ్ విల్ లేదు. ఓటు కు నోటు కేసులో కొంత అప్రతిష్ట పాలైనా ఎంతో కొంత రేవంత్ రెడ్డి కే అనుచరగణం, క్రేజ్ వుంది. అది మల్కాజ్ గిరి లోక్ సభ ఎన్నికల్లో ప్రూవ్ అయ్యింది. కాకపోతే మిగతా కాంగ్రెస్ నాయకుల ఆవేదనలో అర్ధముంది. ఇన్నాళ్ళు కష్టకాలం లో పార్టీని నమ్ముకొని వున్న మమ్మలనందరినీ వదిలి కొత్తగా తీర్ధం పుచ్చుకున్న రేవంత్ రెడ్డి కి , అదీ వయసులోనూ జూనియర్ అయిన వ్యక్తికి పట్టం కట్టటం తనకింద పనిచేయాల్సి రావటం సీనియర్లకు సుతరాము మనస్కరించటం లేదు. చూడబోతే కాంగ్రెస్ ఇప్పట్లో నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపించటంలేదు. కొత్తగా డిల్లీలో వచ్చిన పరిణామాలతో ప్రస్తుతానికి వాయిదాకే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అదేజరిగితే కాంగ్రెస్ కి తెలంగాణా లో భవిష్యత్తు లేదనే చెప్పాలి. ఈ గ్యాప్ ని బిజెపి పూడ్చుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. పాపం కాంగ్రెస్ దీనావస్థ చూస్తే జాలేస్తుంది. ఈ లోపల నాయకులు  తలోదారీ చూసుకోవటమే మంచిది.

Also Read : కాంగ్రెస్ ది భయమా…? బాధ్యతా?